సాక్షి, ముంబై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళిని తాను పట్టించుకోనని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బాహాటంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని..తమకు తోచిన విధంగా మాట్లాడతామని సోమవారం ముంబై శివార్లలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పేర్కొన్నారు. తమ మనసులో ఏముంటే దాన్నే మాట్లాడతామని, కోడ్ సంగతి ఆ తర్వాత చూసుకుంటామని ర్యాలీకి హాజరైన వారిని ఉద్దేశించి రౌత్ చెప్పుకొచ్చారు.
శివసేన నేత వ్యాఖ్యలపై ఈసీ ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా సీపీఐ అభ్యర్ధి కన్నయ్య కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ సంజయ్ రౌత్‌కు ముంబై జిల్లా ఎన్నికల అధికారి ఇటీవల నోటీసులు జారీ చేశారు. కన్నయ్య కుమార్‌ను ఎలాగైనా రానున్న ఎన్నికల్లో ఓడించాలని, అందుకు అవసరమైతే బీజేపీ ఈవీఎంలను టాంపరింగ్ చేయాలని శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. బిహార్‌లోని బెగుసరై నుంచి జేఎన్‌టీయూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ రౌత్‌కు జారీ చేసిన నోటీసులో ఈవీఎంలు, ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం లేనట్టుగా రౌత్ ప్రకటన ఉందని ముంబై సిటీ కలెక్టర్ శివాజీ జోన్‌ధలే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment