
ముంబై: బీజేపీ కురువృద్ధ నేత లాల్‌కృష్ణ అద్వానీపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. ఎన్నికల బరిలో ఉన్నా.. లేకపోయినా.. అద్వానీ బీజేపీకి అతిపెద్ద నాయకుడు అని కొనియాడింది. అద్వానీ లోక్‌సభ నియోజకవర్గమైన గుజరాత్ గాంధీనగర్ సీటు నుంచి అమిత్ షాకు బీజేపీ టికెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన తన పార్టీ పత్రిక ‘సామ్నా’లో అద్వానీపై సంపాదకీయాన్ని ప్రచురించింది.
భారత రాజకీయాల్లో ‘భీష్మాచార్యుడి’గా పేరొందిన అద్వానీని బీజేపీ బలవంతంగా రాజకీయాల నుంచి తప్పుకునేలా చేసిందని శివసేన ఆరోపించింది. బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించలేదని, ఈ పరిణామంతో బీజేపీలో అద్వానీ శకం ముగిసిపోయిందని పేర్కొంది. ‘గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అద్వానీ వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి అమిత్ షా పోటీ చేస్తున్నారు. దీని అర్థం అద్వానీని బలవంతంగా రిటైర్ అయ్యేలా చేయడమే’ అని శివసేన వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment