ముంబై: కేంద్రంలో విపక్షాలను ఏకం చేసి, ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను శివసేన ఎద్దేవా చేసింది. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే సమాధానం లభించిందని తమ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. ‘ప్రధాని పదవికి ప్రతిపక్షంలో కనీసం ఐదుగురు పోటీదారులు ఉన్నారు. కానీ వీరి కలలు కల్లలయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే జవాబు దొరికింది. బీజేపీ 300 సీట్లు గెలుస్తుందని అమిత్ షా ముందే చెప్పారు. ఐదో విడత ఎన్నికలు ముగిసేసరికే బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకుంద’ని శివసేన తెలిపింది. ఎటువంటి కారణం లేకుండానే చంద్రబాబు తనకు తానుగా ఎందుకు ఆయాసపడిపోతున్నారని ప్రశ్నించింది. ఆయన పడుతున్న ఆత్రుతకు ఈనెల 23న ఫుల్‌స్టాఫ్ పడనుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
కాగా, గత వారం రోజులుగా చంద్రబాబు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, శరద్ యాదవ్‌లను కలిసి చర్చోప చర్చలు సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే విపక్షాలన్నీ ఒక తాటిపైకి రావాలన్న ఉద్దేశంతో ఆయన ఢిల్లీ యాత్రలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా రావడంలో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఫలితంగా ఈరోజు జరగాల్సిన ఢిల్లీ పర్యటనను మాయావతి రద్దు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment