పవర్ లూమ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ....
భివండీ, న్యూస్‌లైన్: పవర్ లూమ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును భివండీకి చెందిన పద్మశాలీ సంఘాలు కోరాయి. రాజ్ భవన్‌లో సోమవారం మధ్యాహ్నం భివండీకి చెందిన పద్మశాలీ సంఘాల సభ్యులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో స్థిరపడిన పద్మశాలీల్లో అధిక శాతం మంది పవర్‌లూమ్ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారని గవర్నర్‌కు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన పవర్‌లూమ్ ప్యాకేజీ కేవలం జైన్, మైనార్టీ, బడుగు కులాల వారికే లబ్ధిచేకూర్చేలా ఉందని, ఎస్‌బీసీలకు ఏమాత్రం ప్ర యోజనం కలిగించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌బీసీలకు చెందిన పద్మశాలీలకు కూడా ఈ ప్యాకేజీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భివండీలో తెలుగు ప్రజలు స్థిర పడిన ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తెలుగు పాఠశాలలు, ఆశ్రమశాల, కార్మికులకు ప్రత్యేక వైద్యశాలను నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా విన్నవించారు.
గవర్నర్‌ను కలిసిన వారిలో ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అసంఘట్ పవర్‌లూమ్ విభాగ చైర్మన్, భివండీ పద్మనగర్ పవర్‌లూమ్ వివర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగ పురుషోత్తం, అఖిల పద్మశాలి సమాజం కార్యాధ్యక్షుడు వేముల నర్సయ్య, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, యెల్లె సాగర్ తదితరులు ఉన్నారు.