సోదరీమణులతో బీంట్ సింగ్
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల గురుద్వార జనమ్ ఆస్థాన్(నాన్‌కనా సాహిబ్) ఆదివారం అపురూప ఘట్టానికి వేదిక అయ్యింది. సుమారు 70 ఏళ్ల తర్వాత అక్కడ మొదటిసారిగా కలుకున్న తోబుట్టువులు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దేశ విభజన సమయంలో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిన విషయం తెలిసిందే. అందులో అల్లా రఖీ అనే ముస్లిం మహిళ కుటుంబం కూడా ఉంది. ఈమెకు ముగ్గురు సంతానం. అయితే విభజన సమయంలో చెలరేగిన అల్లర్లలో అల్లా రఖీ కుమారుడు బీంట్ సింగ్ తప్పిపోయాడు. అతడి కోసం ఎంతగా వెదికినా ఫలితం లేకపోవడంతో ఆమె తన ఇద్దరు కూతుళ్లు ఉల్ఫత్ బీబీ, మైరాజ్ బీబీలతో కలిసి పాకిస్తాన్‌కు వలస వెళ్లింది.
ఈ క్రమంలో కొడుకు గురించి తెలుసుకునే ప్రయత్నంలో అల్లా రఖీ పొరుగింటి వారు బీంట్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో ఉన్నాడని తెలుసుకుంది. ఇక ఆనాటి నుంచి బీంట్ సింగ్ ఉత్తరాల ద్వారా తన తోబుట్టువుల సమాచారాన్ని తెలుసుకునే వాడు. కానీ వాళ్లను కలుసుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. అయితే భారత్ నుంచి పాక్ వెళ్లిన సిఖ్ జాతా(గురుద్వారను దర్శించుకునేందుకు వెళ్లిన సిక్కు యాత్రికులు) బృందంలో సభ్యుడైన బీంట్ సింగ్ తన గురించిన సమాచారాన్ని వారికి చేరవేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న ఉల్తాఫ్, మైరాజ్ సోదరుడిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సుమారు 70 ఏళ్ల తర్వాత తన తోబుట్టువులను కలుసుకునే అవకాశం కల్పించిన దేవుడికి తానెంతో రుణపడి ఉంటానని బీంట్ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు.
మేం భారత్‌కు వెళ్తాం
తమ సోదరుడి వీసాను ఇంకా కొన్నాళ్ల పాటు పొడిగించాలని ఉల్తాఫ్, మైరాజ్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు విఙ్ఞప్తి చేశారు. పుట్టింటి వారిని చూసేందుకు భారత్ వెళ్లేందుకు తమకు అనుమతినివ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment