
సాక్షి, గ్యాంగ్‌టక్ : సిక్కి రాష్ట్రంలో కొన్నేళ్లుగా టూరిజం, పారిశ్రామిక అభివృద్ధిలో దూసుకు పోతోందని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని చిన్న రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ఇక్కడ జిల్లాలు నాలుగు.. మొత్తం జనాభా 6 లక్షలు. అయితే సిక్కింలో రిజిస్టరయిన కార్ల సంఖ్య 53,636. జనాభా సగటుతో చూస్తే.. రిజిస్టరయిన కార్ల సంఖ్య చాలా ఎక్కువని రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ శాఖ చెబుతోంది. హిమాలయ రాష్ట్రంలో కొంతకాలంగా టూరిజం విపరీతంగా పెరగడంతో.. కార్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి కార్ల సంఖ్య లక్షకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సిక్కిం రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ శాఖ చెబుతోంది.
సిక్కింకు వాయు, రైలు రవాణా వ్యవస్థలు లేకపోవడంతో ప్రజలు అధికంగా ప్రభుత్వ, వ్యక్తిగత వాహనాల మీద ఆధారపడుతున్నారని ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 90 శాతం ప్రజలు ప్రభుత్వ, ప్రయివేట్ టాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తున్నట్లు రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత కార్లు, బైక్‌ల సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఇక్కడ కూడా కాలుష్య ప్రభావం బాగానే కనిపిస్తోంది.