
కానరాని ‘స్వచ్ఛ'
- రోడ్లపై కుప్పలుగా సీజ్ చేసిన వాహనాలు
- దారి లేక ఇబ్బంది పడుతున్న జనం
- పట్టించుకోని కూకట్‌పల్లి పోలీసులు
కూకట్‌పల్లి: ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం... ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం నిర్వహించింది. అయితే, కూకట్‌పల్లి పోలీసులు మాత్రం తమ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను గాలికొదిలేసి.. కేవలం జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దత్తత తీసుకొని పారిశుద్ధ్య పనులు చేపట్టడం విమర్శలకు దారితీస్తోంది. పోలీసులు సీజ్ చేసిన వాహనాలను స్టేషన్‌కు నాలుగువైపులా రోడ్లపక్కన కుప్పలు కుప్పలుగా పడేసి ఈ మార్గంలో వెళ్లేవారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్టేషన్‌కు ఒక వైపు ప్రభుత్వ పాఠశాల, ఎంఈఓ కార్యాలయం, మరోవైపు జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి సర్కిల్ వార్డుకార్యాలయం, ఈసేవ భవనాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవారు రోడ్డుపై వెళ్లేందుకు దారిలేక ఇబ్బంది పడతున్నారు. అలాగే, పోలీసుస్టేషన్ వద్ద రోడ్లపై పార్క్ చేసిన వాహనాల కారణంగా తమకు ఇబ్బందిగా ఉందని స్థానిక వ్యాపారులు, గ్రామంలోకి వెళ్లేందుకు దారిలేదని కూకట్‌పల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ వల్ల తమకు ఇబ్బందిగా ఉందని, వెంటనే ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తాజాగా కూకట్‌పల్లి డివిజన్ టీఆర్‌ఎస్ నాయకులు, స్థానికులు స్వచ్ఛ హైదరాబాద్ ప్యాట్రన్‌గా వచ్చిన ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌కు వినతిపత్రం ఇవ్వడం గమనార్హం.