
బీజేపీది విశ్వాస ఘాతుకం
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్.పి.చౌదరి పేర్కొనడం విశ్వాస ఘాతుకమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనడం సరికాదు: సీతారాం ఏచూరి
సాక్షి,న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్.పి.చౌదరి పేర్కొనడం విశ్వాస ఘాతుకమేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. సీతారాం ఏచూరి సోమవారం ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీలపై ఇప్పుడు వెనక్కు పోతోందని ఆరోపించారు.
విభజన బిల్లు పై చర్చ జరిగే సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాలకు ప్రతిపాదిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్ల పాటు ఉండాల్సిందేనని వాదించారని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని, విభజన వల్ల నష్టపోతున్న ఏపీని ఆదుకుంటుందని వెంకయ్య రాజ్యసభలో హామీ ఇచ్చారన్నారు. విభజన జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అసలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమే లేదని వాదించడం బీజేపీ నాయకులకు సరికాదన్నారు.