ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
- ప్రత్యేక హోదా కాకుండా ఇంకేదీ అవసరం లేదు
- మీడియాతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సోమవారం ఇక్కడ మహిళా బిల్లుపై జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో పదేపదే డిమాండ్ చేశాం. ప్రత్యేక హోదా కాకుండా ఇంకేదీ అవసరం లేదు. ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారు. ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. గతంలో మీరు ఇచ్చిన హామీని ఎందుకు నిలుపుకోవడం లేదో కేంద్రం చెప్పాలి. ఎందుకు హామీని నిలబెట్టుకోవడం లేదో కేంద్రం సమాధానం చెప్పడంలో విఫలమవుతోంది. విభజన సమయంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా అమలుకు గ్యారంటీ ఏంటని నేను ప్రశ్నించినప్పుడు వెంకయ్య నాయుడు లేచి అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు..హోదా ఇస్తామని ఇప్పుడు ఇవ్వకపోవడంపై కేంద్రం ఉద్దేశం అర్థం కావడం లేదు. కేంద్రం వైఖరిని ప్రజలు గుర్తిస్తారు..’ అని పేర్కొన్నారు. సీపీఎంతో కలిసి పనిచేసే సంకేతాలను పవన్ కల్యాణ్ ఇచ్చారని మీడియా ప్రస్తావించగా ‘కలిసి పనిచేయాలనుకోవడం మంచిదే. ఎంతమంది కలిసొస్తే అంతమంచిది. పవన్ కల్యాణ్ మాతో కలిసి పనిచేయడంపై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది..’ అని పేర్కొన్నారు.