
ప్రత్యేక హోదా ఇవ్వాలని నేడు ఢిల్లీలో ధర్నా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సోమవారం పార్లమెంట్ సమీపంలోని జంతర్ మంతర్ వద్ద నేడు మహా ధర్నా జరగనుంది.
సన్నాహక చర్యల్లో భాగంగా సమావేశమైన నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సోమవారం పార్లమెంట్ సమీపంలోని జంతర్ మంతర్ వద్ద నేడు మహా ధర్నా జరగనుంది. దీనికి సన్నాహంగా ఆదివారమిక్కడ వివిధ రాజకీయ, ప్రజాసంఘాల నేతలు సమావేశమయ్యారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎంపీ డి.రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, ప్రత్యేక హోదా, హామీల అమలు సాధన సమితి, ఆంధ్ర మేధావుల ఫోరం, రాజకీయేతర జేఏసీ నేతలు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. యూపీఏ-1, 2 ప్రభుత్వాలు ఏర్పడడానికి కారణమైన ఏపీని అవకాశవాద రాజకీయాల కోసం కాంగ్రెస్ తొందరపడి విభజించిందని దుయ్యబట్టారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు సహాయం, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాజధానికి నిధులిస్తామని హామీలిచ్చినా, ప్రక్రియ మొదలవ్వలేదని విమర్శించారు. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరు కావాలని ఆంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ కోరారు.