పఠాన్‌కోట్: ఏడాదిన్నర క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన కఠువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సంజీరామ్ కొడుకు అయిన విశాల్‌ను కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేసిందని బాధితురాలి కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఫరూఖీ ఖాన్ చెప్పారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసును సంవత్సరంపాటు విచారించిన అనంతరం న్యాయమూర్తి తేజ్వీందర్ సింగ్ సోమవారం తీర్పు చెప్పారు. ఈ కేసును జమ్మూ కశ్మీర్‌లో కాకుండా బయటి కోర్టు విచారించాలని గతేడాది మే 7న సుప్రీంకోర్టు ఆదేశించడంతో పఠాన్‌కోట్ కోర్టు ఈ కేసును విచారించింది.
రణ్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) కింద కోర్టు వారిని దోషులుగా తేలుస్తూ, బయట మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో వేచి ఉండగా తీర్పు వెల్లడించింది. కోర్టులోకి విలేకరులను అనుమతించలేదు. జమ్మూ కశ్మీర్‌లోని కఠువాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఆలయంలో సామూహిక అత్యాచారం, హత్య జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. బాలికను అపహరించి, ఆలయంలో బంధించి, నాలుగురోజుల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన అనంతరం బండరాళ్లతో మోదీ హత్య చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కోర్టు ఈ కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చగా, వారిలో నలుగురు పోలీసులే కావడం గమనార్హం.
మరణించేవరకు జైలు జీవితమే..
బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆలయ సంరక్షకుడు సంజీరామ్, ప్రత్యేక పోలీస్ అధికారి (ఎస్పీవో) దీపక్ ఖజూరియాతోపాటు మరో వ్యక్తి ప్రవేశ్‌కుమార్‌లను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురూ అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వచ్చిన ఆరోపణలు రుజువైనట్లు కోర్టు తెలిపింది. వీరిని దోషులుగా ప్రకటిస్తూ జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు అంటే మరణించేంత వరకు జైలులో ఉండాల్సిందేనని కోర్టు స్పష్టంగా వివరించింది. అలాగే మరో ఎస్పీవో సురేంద్ర వర్మ, ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరునెలలు ఎక్కువగా జైలు జీవితం గడపాలని ఆదేశించింది. ఆనంద్ దత్తా, తిలక్ రాజ్‌లు కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు సంజీరామ్ నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. బాలిక సంచార జాతికి చెందిన అమ్మాయి కాగా, వారి మైనారిటీ జాతిని పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా పకడ్బందీగా కుట్ర పన్ని ఈ నేరానికి ఒడిగట్టారని చార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
తీర్పుపై మెహబూబా హర్షం..
కోర్టు తీర్పు పట్ల జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు హర్షం వ్యక్తం చేశారు. ‘నేరస్తులను చట్టానికి లోబడి వీలైనంత కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నేరస్తులకు మద్దతు తెలిపిన రాజకీయ నేతలను ఏదైనా అనడానికి అసలు పదాలు లేవు’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులు గతంలో నిందితులకు మద్దతుగా నిలవడం తెలిసిందే. దోషులకు అత్యంత కఠిన శిక్ష పడేలా చేయాలని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. దోషులందరికీ మరణశిక్ష వేయాలంటూ హైకోర్టులో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్మన్ రేఖా శర్మ కోరారు.
మరణశిక్ష పడుతుందనుకున్నాం..
‘నేరస్తులకు మరణశిక్ష పడుతుందని మేం ఆశించాం. నిర్దోషిగా బయటపడిన వ్యక్తీ.. ప్రధాన నిందితుడేనని మేం వింటున్నాం. అలాంటప్పుడు అతణ్ని ఎందుకు విడుదల చేశారు’అని బాలిక తండ్రి అన్నారు. బాధిత కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తాము కోర్టు తీర్పును పరిశీలించిన అనంతరం పై కోర్టుకు వెళ్తామనీ, నిర్దోషిగా విడుదలైన విశాల్‌ను దోషిగా తేల్చాలని అప్పీల్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఓ బాలనేరస్థుడితో సహా మొత్తం ఎనిమిది మందిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయగా, ఏడుగురిపై విచారణను ఈ కోర్టు చూసుకుంది.
ఎప్పుడేం జరిగిందంటే..
► 2018 జనవరి 10: కఠువా జిల్లాలోని రసనా గ్రామంలో బకర్వాల్ సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలిక గుర్రాలను మేపుతుండగా ఆమె ఆచూకీ గల్లంతు.
► జనవరి 12: బాలిక తండ్రి ఫిర్యాదుతో హీరానగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు.
► జనవరి 17: బాలిక మృతదేహం లభ్యం. గ్యాంగ్‌రేప్ తర్వాత చంపేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి.
► జనవరి 22: దేశవ్యాప్త నిరసనలతో జమ్మూ కశ్మీర్ క్రైం బ్రాంచ్‌కు కేసు బదిలీ.
► ఫిబ్రవరి 16: నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన హిందూ ఏక్తా మంచ్. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్.
► మార్చి 1: ప్రధాన నిందితుడు, ఆలయ సంరక్షకుడు సంజీరామ్‌ను బంధువైన బాల నేరస్తుడి అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ ఏక్తా మంచ్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు.
► ఏప్రిల్ 9: మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా తేల్చి, వారిలో ఏడుగురిపై అభియోగపత్రాన్ని కఠువా కోర్టులో దాఖలు చేసిన పోలీసులు
► ఏప్రిల్ 10: బాల నేరస్తుడినని చెప్పుకున్న ఎనిమిదో వ్యక్తి పైనా అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు.
► ఏప్రిల్ 14: మంత్రివర్గం నుంచి తప్పుకున్న చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. బాధితులకు న్యాయం చేయాలన్న ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్.
► ఏప్రిల్ 16: కఠువాలో ప్రధాన సెసన్స్ కోర్టు జడ్జి ముందు విచారణ ప్రారంభం.
► మే 7: కఠువా నుంచి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు విచారణను మార్చిన సుప్రీంకోర్టు. విచారణను రహస్యంగా, వేగవంతంగా, మీడియాకు దూరంగా చేపట్టాలని ఆదేశించిన సుప్రీం కోర్టు.
► 2019 జూన్ 3: విచారణను ముగించిన పఠాన్ కోట్ సెషన్స్ కోర్టు.
► జూన్ 10: దోషులుగా తేల్చుతూ తీర్పు వెల్లyì ంచిన కోర్టు.
సాంజీ రామ్
కఠువా దోషులు దీపక్ ఖజురియా
ఎస్సై ఆనంద్ దత్తా, సురేందర్ వర్మ, తిలక్ రాజ్
ముగ్గురికి యావజ్జీవం
Published Tue, Jun 11 2019 3:32 AM | Last Updated on Tue, Jun 11 2019 9:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment