
చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా కదేనార్ క్యాంపులో దారుణం జరిగింది. కదేనార్ ఐటీబీపీ 45వ బెటాలియన్ క్యాంపులోని మసుదుల్ రహమాన్ అనే జవాన్ బుధవారం ఉదయం తన సర్వీస్ గన్‌తో అయిదుగురు సహచర జవాన్లను కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రహమాన్‌ను అడ్డుకోబోయిన మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించారు. జవాన్ కాల్పులకు దిగడానికి గల కారణాలు తెలియనప్పటికీ.. సెలవు మంజూరు చేయలేదని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని పేర్కొన్నారు.