అసోంలో ఆరుగురు మిలిటెంట్లు హతం
దిస్పూర్: అసోంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. వారిలో ఇద్దరు ఆ మిలిటెంట్ సంస్థ ఉన్నత శ్రేణి నాయకులు ఉన్నారు. శుక్రవారం వేకువ జామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అసోంలోని ఆంగ్లాంగ్ జిల్లాలోని బాని పథార్ అటవీ ప్రాంతంలో పోలీసులు, సైనిక బలగాలు ఉమ్మడిగా తిరుగుబాటుదారుల ఏరివేత కార్యక్రమం ప్రారంభించారు.
కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్(కేపీటీఎల్)కు చెందిన తిరుగుబాటుదారులు బానిపథార్ ప్రాంతంలో సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న బలగాలు, పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించగా వారికి కర్బి తిరుగుబాటుదారులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు. వేకువజామున జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఓ ఆర్మీ జవాను గాయపడగా అతడిని ఆస్పత్రికి తరలించారు.