
ఇద్దరు వ్యక్తులు కలిసి పరీక్ష రాస్తుంటారు..
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ మీమ్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. గతవారం పాక్ చెరలో చిక్కుకుని.. క్షేమంగా తిరిగివచ్చిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తుచేసేలా షేర్ చేసిన మీమ్స్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు ఆమె వెడ్నెస్ డే విజ్డమ్ ట్యాగ్‌ను జత చేశారు.
‘ఇద్దరు వ్యక్తులు కలిసి పరీక్ష రాస్తుంటారు. వారిలో గ్రీన్ కలర్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి పాకిస్తాన్ కాగా, పింక్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి అభినందన్. పాకిస్తాన్ ఏదో అడుగుతుండగా.. అభినందన్ వెనుక నుంచి ఓ కాగితాన్ని అందజేస్తారు. అయితే ఆ కాగితాన్ని తెరచి చూసిన పాకిస్తాన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అందులో.. ఇది నేను మీకు చెప్పకూడదు(i'm not supposed to tell you this) అని రాసి ఉంటుంది’ ఇది స్మతి ఇరానీ షేర్ చేసిన మీమ్స్. అయితే అందులో చాలనే అర్థం ఉంది. అభినందన్ పాక్ చెరలో ఉన్నప్పుడు అక్కడి ఆర్మీ అధికారులు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినప్పటికీ.. తాను ఎటువంటి రహస్యాలను వారికి వెల్లడించలేదు. అంతేకాకుండా ధైర్యంగా ఈ విషయాలు నేను మీతో చెప్పకూడదు అంటూ వారికి సమాధానం ఇచ్చారు. ఈ ఘటనను గుర్తుకు తెచ్చేలా స్మృతి ఈ పోస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది.