పాముకాటుకు 45 వేలమంది మృతి
న్యూఢిల్లీ: పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల సంఖ్య ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతియేటా పాముకాటుకారణంగా చనిపోతున్నవారు ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా 45 వేలమంది. ప్రతి ఏడాది 45 వేలమంది పాముకాటుకారణంగా చనిపోతుండగా.. దాదాపు 2లక్షలమంది అంగ విచ్ఛేదనానికి గురవుతున్నారు. ది ఇంటరాక్షన్ అనే కార్యక్రమ నిర్వాహకులు ఈ విషయాన్ని తెలిపారు. ఇది అంత తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదని హెచ్చరించారు.
పాముకాటుకు గురైన వారిల్లో ఏడుగురులో ఒక్కరు మాత్రమే ఆస్పత్రికి చేరగలుగుతున్నారని, అప్పటికీ ఆలస్యం కారణంగా వారు ప్రాణాలువిడుస్తున్నారని తెలిపారు. ఎక్కువమంది పొలాల్లో పనులకు నిమగ్నమై ఉన్నప్పుడే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, నిర్లక్ష్యం, సౌకర్యాలు, మౌలిక వసతుల ఏర్పాట్ల లేమి వల్ల పాముకాటుకు గురైన వారు ప్రాణాలుకోల్పోవల్సి వస్తుందని చెప్పారు.
ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్రలోని అంధరి టైగర్ రిజర్వకు సమీపంలో చిరాగ్ రాయ్ అనే వ్యక్తి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇతడు పాముల విషయంలో నిపుణుడు అయినప్పటికీ ఆస్పత్రికి చేరుకునేలోగానే ప్రాణాలుకోల్పోయాడు. అందుకు ప్రధాన కారణం దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన నాలుగు విషజాతి సర్పాలు ఈ ప్రాంతంలో ఉండటం. ముఖ్యంగా కోబ్రా నాగుపాము చాలా అపాయకరమైనది. ఈ పాముల విషయంలో ముందు జాగ్రత్తలు పాటించకుంటే మాత్రం విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.