ఊహించని ట్విస్ట్: పాము కాటేసిందని..
రాంచీ: జార్ఖండ్‌లో ఓ గిరిజనుడు విచిత్రమైన చర్యకు పాల్పడ్డాడు. విషపూరితమైన పాము తననకు కాటేయడంతో అతను ఆ పామును బతికుండగానే తినేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలోని లోహర్‌దగా జిల్లాలోని హమ్రు గ్రామంలో జరిగింది.
30 ఏళ్ల సురేంద్ర ఓరాన్ తన పొలంలో పనిచేసుకుంటుండగా అతన్ని పాము కరిచింది. దానికి అతను భయపడకపోగా.. ఆ పామును పట్టుకొని తినేశాడు. తలభాగం మినహా పూర్తిగా స్వాహా చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లగానే అతని పరిస్థితి క్షీణించింది. జరిగిన ఘటన గురించి అతను కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వారు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగానే ఉంది. వైద్యులు అతనికి చికిత్స అందించి శనివారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఓరాన్‌కు చికిత్స అందించిన డాక్టర్ శైలేష్ కుమార్ మాట్లాడుతూ 'రాత్రి మొత్తం అబ్జర్వేషన్‌లో పెట్టాం. అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా బాగుండటంతో శనివారం ఉదయమే అతన్ని డిశ్చార్జ్ చేశాం' అని చెప్పారు.
పాము కరిచిన తర్వాత దానిని తింటే బాధితులకు ఏమీ కాదని, విషం ఎక్కదని పలువురు చెప్పడంతో తాను విన్నానని, అందుకే అలా చేశానని ఓరాన్ చెప్తున్నాడు. జార్ఖండ్‌లోని కొల్హాన్ గిరిజన తెగకు ఇలాంటి నమ్మకాలు అనేకం ఉన్నాయి. గబ్బిలాలను తింటే బ్రెయిన్ స్ట్రోక్ రాదని, ఎలుగుబంట్లను తింటే మలేరియా రాదని, ఎండ్రికాయలను తింటే లైంగిక శక్తి పెరుగుతుంతని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు. అంతేకాదు కరిచిన పామును తినడం వల్ల బాధితులు బతికిన ఘటనలు నాలుగైదు తమ ప్రాంతంలో జరిగాయని వారు చెబుతారు.