పాక్తో భారత్ వ్యాపారాన్ని రద్దు చేసుకుంటే...
న్యూఢిల్లీ: భారత్‌కు టెర్రరిజాన్ని ఎగమతి చేస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా పాకిస్థాన్‌కు భారత్ 1996లో కల్పించిన వాణిజ్యానికి ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (అత్యంత సానుకూలమైన దేశం–ఎంఎస్‌ఎన్)’ హోదాను గురువారం సమీక్షిస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ హోదాను రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్నట్టయితే అది కేవలం ప్రతీకాత్మక నిరసన అవుతుంది తప్ప పాకిస్థాన్‌కు ఈషన్మాత్రం నష్టం వాటిల్లదు. పైగా భారత్ నుంచే ఎక్కువ టారిఫ్‌కు సరకులు ఎగుమతి చేస్తూ, ఇతర దేశాలకన్నా కాస్త తక్కువ టారిఫ్‌కు సరకులను దిగుమతి చేసుకుంటున్నందున అంతో ఇంతో నష్టం భారత్‌కే కలుగుతుందని ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య లావాదేవీలు తెలియజేస్తున్నాయి.
పాకిస్థాన్‌కు భారత్ ఎగుమతులు 2007–08 సంవత్సరంలో 0.78 శాతం ఉండగా, 2015–16 సంవత్సరానికి అవి 0.88 శాతానికి మాత్రమే చేరుకున్నాయి. వృద్ధి రేటు నామమాత్రంగానే ఉండగా, భారత్ ఎగుమతుల్లో పాకిస్థాన్‌కు చేస్తున్న ఎగుమతులు ఒక్క శాతం కూడా లేదన్నమాట. ఇక పాకిస్థాన్ నుంచి చేసుకుంటున్న దిగుమతులు గురించి చెప్పుకోనవసరమే లేదు. గత ఏడాది లెక్కల ప్రకారం భారత్ 0.12 శాతం సరకులను దిగుమతి చేసుకుంది. మొత్తం దక్షిణాసియా నుంచి పాకిస్థాన్ చేసుకుంటున్న దిగుమతులే నాలుగు శాతం మించి లేవు. అంటే మొత్తం దక్షిణాసియా దేశాలన్ని కలసికట్టుగా వ్యాపార ఆంక్షలు విధించినా పాకిస్థాన్‌కు కలిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు.
ఇరు దేశాల మధ్య 2,646 సరకుల లావాదేవీలు జరుగుతుండగా, వాటిలో 1181 సరకులు ఉమ్మడి దిగుమతి, ఎగుమతుల జాబిలాలో ఉన్నాయి. అంటే, ఈ సరకులను మనం ఆ దేశానికి ఎగుమతి చేస్తున్నాం. మళ్లీ అవే సరకులను దిగుమతి చేసుకుంటున్నాం. పాకిస్థాన్ దిగుమతుల యూనిట్ విలువ ఎక్కువ, భారత్ ఎగుమతుల యూనిట్ విలువ తక్కువ అవడం వల్ల ఇరుదేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు నిలిచిపోతే భారత్‌కే నష్టమని ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఐఆర్‌ఈఆర్)’ గతేడాదే ఓ నివేదికలో వెల్లడించింది.
పాకిస్థాన్‌కు భారత్ పత్తి, సేంద్రీయ ఎరువులు, చక్కెర, చక్కెర ఉత్పత్తులు, ఆహార పరిశ్రమ వ్యర్థాలు, కూరగాయలు, కాఫీ, టే, మషినరీ, బాయిలర్స్, నౌకలు, బోట్లు, రంగులు, ప్లాస్టిక్స్ ఎగుమతి చేస్తుండగా, పాకిస్థాన్ నుంచి భారత్ పండ్లు, గింజలు, పత్తి, ఉప్పు, సున్నం, గంధకం, నూనెలు, ఖనిజ ఇంధనాలు, సేంద్రీయ ఎరువులు, ప్లాస్టిక్స్, అసేంద్రీయ రసాయనాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఈ ఎగుమతులు, దిగుమతుల విలువ ఏడాదికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు.
పాకిస్థాన్ తనకు అవసరమైన బంగారం, మషినరీ, ఎలక్ట్రానిక్ వస్తువులను దుబాయ్ దేశం ద్వారా భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. భారత్‌కు ఈ ఎగుమతులతో ఎలాంటి సంబంధం లేదు. మధ్యవర్తి దేశంతోనే సంబంధం. రేపు పాకిస్థాన్‌కు ఎగుమతులు భారత్ నిలిపివేసినా వాటిని కోరుకున్నట్లయితే దుబాయ్ ద్వారానే పాకిస్థాన్ దిగుమతి చేసుకోవచ్చు. భారత్‌కు సరకులు దిగుమతి చేస్తున్న పాకిస్థాన్ వ్యాపారుల్లో ఎక్కువ మంది అయిష్టంగానే వ్యాపారం చేస్తున్నారు. భారత్‌కు బదులుగా వారు తమ సరకులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎగుమతి చేయాలని ఆశిస్తున్నారు. అలా చేయడం వల్ల టారిఫ్‌ల్లో వ్యత్యాసాల కారణంగా ఎక్కువ లాభాలు వస్తాయన్నది వారి అంచనా.
ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వెనకునున్న ఉద్దేశం వ్యాపారం కాదని, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడడం, ఇరు దేశాల మధ్య మైత్రి నెలకొనడమే లక్ష్యమని భారత్‌లో పాకిస్థాన్ హై కమిషనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన అజీజ్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం.