ఆరెస్సెస్కు గోవా గండం.. భారీగా రాజీనామాలు
పనాజీ: ఆరెస్సెస్లో కూడా అసంతృప్తి ముసలం మొదలైంది. గోవా ఇందుకు వేదికైంది. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని గోవా ఆరెస్సెస్ చీఫ్ సుభాష్ వెలింకార్ను తొలగిస్తూ ఆ సంస్థ ఉన్నత విభాగం నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయాన్ని వందల సంఖ్యలో ఆరెస్సెస్ వాలంటీర్లు వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 400 మంది ఆరెస్సెస్ వాలంటీర్లు రాజీనామాలు చేశారు. తాము ఆరెస్సెస్లో కొనసాగబోమని ప్రకటించారు.
వీరిలో జిల్లా చీఫ్, మండల చీఫ్లు కూడా ఉన్నారు. వెలింకార్ను గోవా చీఫ్ బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రకటన వెలువడిన అనంతరమే పనాజీలోని ఓ పాఠశాలలో ప్రత్యేకంగా స్థానిక పార్టీ నేతలు, ఆఫీస్ బేరర్లతో భేటీ అయిన వెలింకాన్ మద్దతుదారులు దాదాపు ఆరుగంటలపాటు చర్చించి చివరకు ఆరెస్సెస్, బీజేపీ ఉన్నతస్థాయి నాయకత్వాన్ని తప్పుబడుతూ ప్రకటన వెలువరించారు. తామంతా ఆరెస్సెస్లో ఉండబోమంటూ 400 మంది రాజీనామా చేశారు. తనను తొలగించి తప్పు చేశారని, ఈ ఒక్క కారణంతోనే బీజేపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయం అని వెలింకార్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.