
న్యూఢిల్లీ: తెహెల్కా మ్యాగజైన్ ఫైనాన్సియర్స్‌పై విచారణలో జోక్యం చేసుకోవాలని 2004లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. తెహెల్కా పెట్టుబడిదారులపై రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు అనుసరిస్తున్న వైఖరి అన్యాయంగా ఉందని, ఈ అంశాన్ని పరిష్కరించాలని లేఖలో సోనియా కోరారు. తెహెల్కా.కామ్ ప్రధాన పెట్టుబడిదారైన ఫస్ట్ గ్లోబల్ డైరెక్టర్ పంపిన వివరాల్ని పరిశీలించాలని అప్పట్లో నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా కేబినెట్ మంత్రి హోదాలో సోనియా కోరారు. 4 రోజులకు యూపీఏ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసింది. 6 రోజులకు ఫస్ట్ గ్లోబల్‌పై కేసును ఉపసంహరించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన సోనియా గాంధీ లేఖపై చిదంబరం స్పందిస్తూ.. ‘ఆ లేఖను పరిశీలించిన విషయం వాస్తవం. సోనియా లేఖకు తాను ఇచ్చిన సమాధానాన్ని కేంద్రం బయటపెట్టాలి. రెండింటిని కలిపి చదివితే స్పష్టత వస్తుంది’ అని వివరణ ఇచ్చారు. అప్పట్లో తెహెల్కా పత్రిక బహిర్గతం చేసిన రక్షణ ఒప్పందాల అవినీతికి బాధ్యత వహిస్తూ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన బీజేపీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ను అనంతరం కోర్టు దోషిగా నిర్ధారించింది. అత్యాచారం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న తరుణ్ తేజ్‌పాల్ అప్పట్లో తెహెల్కా ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ అవినీతి వెలుగులోకి వచ్చాక.. ఫస్ట్ గ్లోబల్ ప్రమోటర్లు దెవినా మెహ్ర, శంకర్ శర్మలపై వివిధ దర్యాప్తు సంస్థలు పలు కేసులు నమోదు చేశాయి. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక మెహ్ర, శర్మలు సోనియాకు లేఖ రాస్తూ దర్యాప్తు సంస్థల వేధింపులు కొనసాగుతున్నాయని, పరిష్కరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment