ఇక దేశంలో ప్రయాణించాలన్నా పాస్‌పోర్ట్!
న్యూఢిల్లీ: భారత పౌర విమానాయాన సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక నుంచి దేశం లోపల విమానాల్లో ప్రయాణించాలనుకున్నప్పటికీ పాస్‌పోర్టు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. లేదా ఆధార్ కార్డు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్ (సీఏఆర్)ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేశారు. వచ్చే వారం దానిని ప్రజల ముందుకు తీసుకొచ్చి అభిప్రాయం కోరనున్నారు. నెల రోజుల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ విధానాన్ని మూడు నాలుగు నెలల్లో అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాల్లో ప్రయాణిస్తూ నిబంధనలు అతిక్రమించేవారికి నాలుగు స్థాయిల్లో వారు చేసిన పనిని బట్టి శిక్ష విధించే యోచనను భారత పౌర విమానాయాన సంస్థ చేస్తోంది. ఈ నేపథ్యంలో అలా తప్పిదాలకు పాల్పడే వారి పూర్తి వివరాలు తెలుసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందస్తుగా టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో పాస్‌పోర్ట్, ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేందుకు ఈ నిబంధన ఉన్న విషయం తెలిసిందే.