జియాఖాన్ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు!
ముంబై: బాలీవుడ్ కథానాయిక జియాఖాన్ మృతికేసులో సీబీఐ తాజాగా దాఖలుచేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. జియాఖాన్ గర్భం దాల్చిందని తెలియడం.. ఆమె అబార్షన్‌కు సూరజ్ పంచోలి సహకరించడం, ఈ తర్వాత జరిగిన విపరీత పరిణామాలతో మానసికంగా ఛిన్నాభిన్నమైన జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. జియాఖాన్ మృతి వెనుక పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లి రబియా ఖాన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ కేసును సీబీఐ స్పెషల్ క్రైమ్ డివిజన్‌కు అప్పగించింది. జియాఖాన్‌ది ఆత్మహత్యనా లేక హత్య నా తేల్చాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో హత్యాభియోగాలను సీబీఐ చార్జ్‌షీట్‌లో మోపలేదు. కానీ ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించింది సూరజ్ పంచోలియేనంటూ బలమైన కేసు రూపొందించేదిశగా చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు కనిపిస్తున్నది.
బుధవారం సెషన్ కోర్టుకు సమర్పించిన సీబీఐ చార్జ్‌షీట్ ప్రకారం.. తాను గర్భం దాల్చిన నాలుగువారాలకు ఈ విషయాన్ని జియా పంచోలికి తెలిపింది. దీంతో వారు ఓ డాక్టర్‌ను కలిశారు. ఆయన గర్భస్రావం కావడానికి కొన్ని ఔషధాలు రాసిచ్చారు. అవి పనిచేయకపోవడంతో వారు మళ్లీ ఓ గైనకాలజిస్ట్‌ను కలిశారు. దీంతో మరింత బలమైన మందులను ఆయన ఇచ్చారు. 'ఆ మందులు తీసుకున్న తర్వాత జియాఖాన్‌కు రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె పంచోలీ సాయాన్ని కోరింది. తీవ్రమైన బాధతో విలవిలలాడుతున్న ఆమె వైద్య సాయాన్ని కోరగా.. పంచోలీ మాత్రం తాను గైనకాలజిస్ట్‌ను సంప్రదించి గైడెన్స్ తీసుకొనేవరకు వేచిచూడమని ఆమెకు సలహా ఇచ్చాడు. జియాఖాన్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని, గర్భస్రావం అయినా పిండం శరీరంలోనే ఉండటం వల్ల రక్తస్రావం జరిగి ఉండవచ్చునని డాక్టర్ పంచోలీకి సూచించాడు. కానీ పంచోలీ భయపడ్డాడు. జియాఖాన్ ఆస్పత్రిలో చేరితే.. తమ అనుబంధం గురించి బయటి ప్రపంచానికి తెలుస్తుందని, దీంతో తాను సినిమాల్లోకి ప్రవేశించకముందే తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంటుందని భావించాడు.
ఆస్పత్రికి వెళ్లడం కంటే తానే ఈ సమస్యను పరిష్కరించాలని భావించాడు. జియాఖాన్ కడుపులోని పిండాన్ని స్వయంగా బయటకు తీసి.. అతను టాయ్‌లెట్‌లో పడేశాడని సీబీఐ చార్జ్‌షీట్‌లో వివరించింది. ఈ ఘటనతో జియాఖాన్ మానసికంగా కుంగిపోయిందని, ఆ తర్వాత పంచోలీని అట్టిపెట్టుకొని ఉండాలని ఆమె భావించినా.. అతను ఆమెను దూరం పెట్టడంతో మరింత మానసిక కుంగుబాటుకులోనై జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నదని సీబీఐ వివరించింది. ఈ చార్జ్‌షీట్‌లోని వివరాలు 'ముంబై మిర్రర్' పత్రిక వెలుగులోకి తెచ్చింది.