హీరోయిన్ మృతికేసులో విచారణపై స్టే
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్ పంచోలికి వ్యతిరేకంగా జరుగుతున్న విచారణపై మధ్యంతర స్టే విధిస్తూ బొంబాయి హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌కు వ్యతిరేకంగా జియాఖాన్ తల్లి రబియా ఖాన్ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జియాఖాన్‌ది ఆత్మహత్యేనని, ఆమెది అనుమానాస్పద మరణం కాదని పేర్కొంటూ సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2013 జూన్ 3న జియాఖాన్ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె ప్రియుడు సూరజ్ పంచోలి నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసులో గత ఏడాది డిసెంబర్‌లో సీబీఐ సమర్పించిన అఫిడవిట్‌లో పలు లొసుగులు ఉన్నాయని, ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి.. హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని రబియాఖాన్ తన పిటిషన్‌లో కోరారు. వాదనలు విన్న జస్టిస్ ఆర్వీ మోర్, జస్టిస్ వీఎల్ అచిలియా ధర్మాసనం కేసు విచారణపై మధ్యంతర స్టే విధించింది. రెండువారాల్లోగా రబియాఖాన్ పిటిషన్‌పై తన అఫిడవిట్ సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. జియాఖాన్ అమెరికా పౌరురాలు అయినందున ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌డీఐ కూడా సిట్‌కు సహకరించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.