అండమాన్‌లో నైరుతి రాగం
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులతో పాటు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతాన్ని తాకాయని తెలిపింది. ఇవి మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలోని దక్షిణ, మధ్య ప్రాంతాలకు విస్తరించవచ్చని తెలిపింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళ తీరానికి చేరుకొంటాయని, అయితే ఈసారి నాలుగు రోజులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ప్రస్తుతం అండమాన్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయని విశాఖలోని వాతావరణనిఫుణులు వెల్లడించారు. మరోపక్క. చత్తీస్‌ఘడ్ నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడినట్టు విశాఖలోని వాతావరణ కేంద్రం తె లిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు, ఉరుమలతో కూడి జల్లులు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. ఇదిలాఉండగా, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే సూచనలు ఉండటంతో వ్యవసాయవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పిడుగుపాటుకు ఇద్దరి మృతి
మెంటాడ / మడకశిర, న్యూస్‌లైన్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు పడి సోమవారం ఇద్దరు మృతి చెదారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొంపంగి గ్రామంలో తన పొలంలో పనిచేసుకుంటున్న ఎజ్జిపరపు సింహాచలం (40) అనే మహిళపై పిడుగు పడగా, ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందాపురం గొల్లహట్టి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మాలింగప్ప పిడుగుపాటుకు మరణించాడు. అతను గొర్రెలను కాాస్తుండగా వర్షం పడటంతో ఓ చింత చెట్టు కిందకు వచ్చాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో అతడితో పాటు రెండు మేకలు మృతి చెందాయి. విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎస్.కోట, వేపాడ, పార్వతీపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఎస్.కోట మండలంలో పలుచోట్ల ఈదురుగాలలకు చెట్లు విరిగిపడ్డాయి.