తండ్రి అంతిమయాత్రలో నమిత... పై ఫొటో అంతిమ నివాళి
ప్రభూ! నన్ను అంత ఎత్తుగా ఎదగనీయకు
నేల మీద గడ్డి పరకలు కనపడనంత ఎత్తుకు ఎదగనీయకు
ఇతరులను గుండెకు హత్తుకోలేనంత కాఠిన్యాన్ని నాకివ్వకు.
వాజ్‌పేయి రాసుకున్న ఓ కవిత సారాంశమిది. కవితల్లో రాసుకున్నట్లే జీవించారాయన. అందుకు ఉదాహరణ ప్రధానమంత్రి హోదాలో కాన్వాయ్‌ను ఇష్టపడకపోవడమే. ‘రోడ్లు నిర్మానుష్యంగా ఉంటే కర్ఫ్యూ గుర్తుకొస్తోంది. ప్రజాస్వామ్యంలో పాలకులు పాలితులకు దగ్గరగా ఉండాలి. వాళ్లను చూస్తూ పాలించాలి. అప్పుడే ప్రజల అవసరాలేంటో తెలుస్తాయి. ప్రజలు కనిపించకుండా ఇలా పోలీసు వాహనాల మధ్య ప్రయాణించడం ఏమిటి?’ అనిన మనిషి ఆయన. అధికారాన్ని దర్ప ప్రదర్శన కోసం వినియోగించని గొప్ప సిద్ధాంతం ఆయనది. అదే సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారు ఆయన దత్తపుత్రిక నమిత భట్టాచార్య. వాజ్‌పేయి ఏదీ చెప్పి ఆమెను పెంచలేదు, తాను ఆచరించారు, నమిత అనుసరించారు. ఆమె వ్యక్తిత్వం అలాగే వికసించింది.
నాన్నే.. నచ్చిన రాజకీయవేత్త
ఇరవయ్యవ శతాబ్దం చివరి దశాబ్దం. వాజ్‌పేయి జాతి నిర్మాణంలో కీలకంగా పనిచేస్తున్న సమయమది. దేశానికి ప్రధానమంత్రి హోదాలో అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. అప్పుడు కూడా నమిత స్కూలు టీచరుగా తన ఉద్యోగంలోనే కొనసాగారు. తండ్రి ప్రధాని పదవిని అంది వచ్చిన అవకాశంగా మలుచుకోవాలనుకోకపోవడం ఆమె ఔన్నత్యం. వ్యక్తిగా అత్యున్నత స్థాయి గౌరవాలు ఆమెకు పువ్వుకు తావిలా వచ్చి చేరడానికి కారణం ఆమె తనను తానుగా తీర్చిదిద్దుకున్న విధానమే. ఇష్టమైన రాజకీయవేత్త ఎవరని అడిగితే... మరో మాటకు అవకాశం లేకుండా ‘మా నాన్న’ అని వాజ్‌పేయి పేరు చెప్తారామె.
నాన్నకు నచ్చాకే అల్లుడయ్యాడు
నమిత ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్‌లో కామర్స్ గ్రాడ్యుయేషన్‌లో ఉండగా అదే కాలేజ్‌లో ఎకనమిక్స్ చదువుతున్న రంజన్ భట్టాచార్య పరిచయమయ్యారు. రంజన్ తరచుగా వాజ్‌పేయి ఇంటికి వస్తుండేవారు. రంజన్‌ని వాజ్‌పేయి ఆదరంగా చూసేవారు, అంతే నిశితంగానూ గమనించేవారు. ఇరవై ఏళ్లకే తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతోనో ఏమో కానీ వాజ్‌పేయిలో తండ్రిని వెతుక్కున్నారు రంజన్. వాజ్‌పేయిని నమిత పిలిచినట్లే ‘బాప్‌జీ’ అని పిలిచేవారు. నమిత పట్ల రంజన్ ప్రేమను అంగీకరించి అతడిని అల్లుడుగా స్వీకరించారు వాజ్‌పేయి. వాళ్ల పరిచయం పెళ్లి పీటలను చేరడానికి దాదాపుగా ఏడేళ్లు పట్టింది. వాజ్‌పేయి మనసు చూరగొని నమితను పెళ్లి చేసుకున్నాడీ బెంగాల్ బాబు.
ఈ మూడూ నచ్చిన వ్యాపకాలు
వాజ్‌పేయి తరచుగా రంజన్ పేరును మర్చిపోయేవారట. ఆ సంగతిని స్నేహితులు, బంధువులతో నమిత నవ్వుతూ చెప్పేవారు. అంతేకాదు, భట్టాచార్యకు బదులుగా బెనర్జీ, ముఖర్జీ అని, ఒక్కోసారి ఏ పేరూ గుర్తుకు రాక, బెంగాలీబాబు అని కూడా పిలిచేవారని చెప్తుంటారామె. నమితకు పుస్తకాలు చదవడం, రుచిగా వండడం, కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం ఇష్టమైన వ్యాపకాలు. రంజన్ భట్టాచార్యకు హైవే మీద లాంగ్ డ్రైవ్ చేయడం ఇష్టం. భార్యాభర్తల్లో ఒకరి ఇష్టాలు మరొకరి ఇష్టాలతో పడుగుపేకల్లా అల్లుకు పోవడం చాలా అరుదుగానే ఉంటుంది. బహుశా వాజ్‌పేయి అన్నేళ్లపాటు అంత నిశితంగా గమనించింది.. ఇద్దరి మధ్య అలాంటి అనుగుణ్యత (కంపాటిబిలిటీ) ఉందా లేదా అనే కావచ్చు.
నచ్చలేదేమో అనుకున్నారు!!
నమిత భట్టాచార్యను అందమైన ప్రేమ పందిరికి అల్లుకున్న సన్నజాజి తీగ అని చెప్పవచ్చు. ఆమె తాను పెరగాల్సిన పందిరిని తానే పటిష్టం చేసుకున్నారు. ఎలాగో తెలియాలంటే.. ఒక్కసారి గ్వాలియర్‌లో వాజ్‌పేయి గ్రాడ్యుయేషన్ రోజుల్లోకి వెళ్లాలి. వాజ్‌పేయి తొలిచూపులోనే రాజ్‌కుమారి హస్కర్‌ని ప్రేమించారు. ఆమె చక్కని రూపాన్ని కళ్లలో నింపుకుని ఆశువుగా తనకు తానే కవితలు చెప్పుకున్నారు. ధైర్యం చేసి ఓ రోజు ఉత్తరం రాసి లైబ్రరీ పుస్తకంలో పెట్టి, ఆ పుస్తకాన్ని రాజ్‌కుమారికిచ్చారు. ఆమె నుంచి రిప్లై వస్తుందని ఎంతగానో ఆశించారు. మనసు పరిపరివిధాలుగా ఆలోచిస్తోంది. అసలే పెద్దింటమ్మాయి. గొప్ప వంశ చరిత్ర ఉన్న ఇంటి ఆడపిల్లను తనలాంటి మధ్య తరగతి కుర్రాడికిచ్చి పెళ్లి చేయడానికి వాళ్ల పెద్దవాళ్లు ఒప్పుకోరేమో.. అనుకున్నారు. పెద్దవాళ్లు ఒప్పుకోరని తెలిసే రాజ్‌కుమారి తన ఉత్తరానికి రిప్లై ఇవ్వడం లేదేమో.. అని కూడా అనుకున్నారు. బహుశా ఆమెకి తన మీద ప్రేమ లేకపోవచ్చు. తనతో జీవితాన్ని పంచుకోవాలని కోరుకోవడం లేదేమో.. అని కూడా. ఇలా ఆలోచిస్తూనే రోజులు గడిచిపోతున్నాయి.
నచ్చిన విషయం ఒక జ్ఞాపకం
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశవిభజన సమయంలో చెలరేగిన అల్లర్లు గ్వాలియర్‌ను కూడా కుదిపేశాయి. రాజ్‌కుమారి తండ్రి కుటుంబాన్ని ఢిల్లీకి మార్చారు. రాజ్‌కుమారి రాసిన ప్రత్యుత్తరం లైబ్రరీ పుస్తకంలో ఉందని వాజ్‌పేయికి తెలియకనే ఆ పుస్తకం లైబ్రరీకి చేరిపోయింది. ఆయన ఆ రోజు తెరవని ఆ పుస్తకం, చదవని ఆ ఉత్తరం ఆయన జీవితపథాన్ని మార్చేసింది. అవివాహితుడిగా మిగిల్చింది. ఆ సంగతి ఏళ్ల తర్వాత బయటపడింది.రాజ్‌కుమారి విషయానికి వస్తే.. తన నిర్ణయం తన చేతిలో లేని పరిస్థితి. తండ్రి పెళ్లి సంబంధం నిశ్చయం చేశాడు. మనసు విప్పి వాజ్‌పేయి గురించి చెప్పడానికి, మరికొంత సమయం ఇమ్మని అడగడానికి రాజ్‌కుమారికి తల్లి లేదు. సవతి తల్లితో పంచుకోలేకపోయింది. ఇక పెద్దవాళ్లు నిర్ణయించిన పెళ్లి చేసుకున్నారామె.
కాలానికి న చ్చి మళ్లీ కలిపింది
పంతొమ్మిది వందల నలభైలలో తొలిచూపులు అలా విఫలమయ్యాయి. వాళ్లిద్దరూ తిరిగి కలుసుకునే అవకాశాన్ని కాలం అరవైలకు నిర్ణయించింది. అప్పటికి వాళ్లు దూరమై పదిహేనేళ్లు దాటిపోయింది. అయితే వారిని దూరం చేసిన ఢిల్లీనే మలిసారి కలిపిన వేదికైంది. అప్పుడు వాజ్‌పేయి జనసంఘ్ నాయకులు, రాజ్యసభ సభ్యులు. రాజ్‌కుమారి.. భర్త బ్రిజ్ నారాయణ్ కౌల్, ఇద్దరు కూతుళ్లు నమిత, నందితలతో కలిసి జీవిస్తున్నారు. బ్రిజ్ నారాయణ్ కౌల్ ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌జాస్ కాలేజ్‌లో ఫిలాసఫీ ప్రొఫెసర్. కౌల్ కూడా జనసంఘ్ సిద్ధాంతాలు, వాజ్‌పేయి ఉద్దేశాలతో ఏకీభవించేవారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయత భావాన్ని పెంపొందించడానికి వాజ్‌పేయి చేస్తున్న ప్రయత్నాల్లో సహకరించేవారు. వాజ్‌పేయి తరచుగా యూనివర్సిటీ కెళ్తుండేవారు. విద్యార్థులతో చర్చల్లో పాల్గొనేవారు. అలా నమిత వాజ్‌పేయిని తరచుగా చూసేవారు. అనేకమంది విద్యార్థులు స్ఫూర్తిపొందినట్లే వాజ్‌పేయిలోని ఆదర్శవాదం, ఔన్నత్యం, తాత్త్వికత, నిరాడంబరత నమితను కూడా ప్రభావితం చేశాయి. నమితను పుత్రికగా దత్తత తీసుకోవాలనే వాజ్‌పేయి అభిలాషను నమిత కూడా అంతే ఇష్టంగా స్వీకరించారు. పెద్దయిన తర్వాత... తూర్పు–పడమరలుగా మిగిలిపోయిన జీవితాలను ఒక చూరు కిందకు తీసుకురావడానికి ఆమె నిట్టాడిగా మారారు. ‘గున్ను’ (నమితను ముద్దుగా పిలుచుకునే పేరు) మాటను కాదనేవారు కాదు వాజ్‌పేయి. అవివాహితుడుగా ఉండిపోయిన వాజ్‌పేయి కుటుంబాన్ని విస్తరింపచేశారు నమిత. చెల్లెలు నందిత, తల్లి, తండ్రి, అమ్మమ్మ అందరూ ఒకే ఇంట్లో ఉండే ఏర్పాటు చేశారు. పెళ్లితో భర్త రంజన్ కూడా అదే ఇంటికి వచ్చారు.
హోదా జీవితం నచ్చదు
పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్‌ల మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకున్న వేదాంతి వాజ్‌పేయి. ఆయన పెంపకంలో నమిత కూడా అలాంటి తత్వాన్నే ఒంటపట్టించుకున్నారు. నాలుగేళ్ల కిందట నమిత తల్లి రాజ్‌కుమారి మరణించినప్పుడు సోనియా గాంధీ సహా, జాతీయ నాయకులు అనేక మంది వాజ్‌పేయి ఇంటికి వెళ్లి నమితను పరామర్శించారు. వాజ్‌పేయికి భారతరత్న వచ్చినప్పుడు అభినందనల వెల్లువను కూడా తండ్రి తరఫున ఆమే స్వీకరించారు. అయినా సరే ఆమె తన జీవితాన్ని అత్యంత సాధారణంగా జీవించడానికే ఇష్టపడుతుంటారు. ఆమె ఇంటర్వ్యూ కోసం జాతీయ మీడియా ప్రయత్నించినప్పుడూ ఆమె సున్నితంగా తిరస్కరించేవారు. ఆమె మీడియాకు కనిపించిన సందర్భాలు రెండే రెండు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె తండ్రితోపాటు బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు. అప్పుడు అధికారికంగా విడుదలైన ఫొటోలో తొలిసారి కనిపించారు. తర్వాత ఇప్పుడు వాజ్‌పేయి మరణించినప్పుడు మాత్రమే.
‘కూతురు’ చేసింది జాతికి నచ్చింది
సంప్రదాయాన్ని పాటిస్తూ, సంప్రదాయానికి కొత్తబాట వేసిన దార్శనికత నమితది. తండ్రి పార్థివ దేహానికి ముందు నిప్పుకుండతో నడిచి, ఆయన చితికి స్వయంగా నిప్పంటించి నివాళులర్పించారు. నమిత భట్టాచార్యకంటే ముందు కూడా తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు చేసిన కూతుళ్లున్నారు. కానీ అదే పని నమిత చేయడంతో జాతి మొత్తానికీ దిశానిర్దేశం చేసినట్లయింది.
తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు నిర్వహించే అర్హత కొడుకులకు తప్ప కూతుళ్లకు ఉండదనే కరడు కట్టిన అభిప్రాయాన్ని సమూలంగా తుడిచేశారు నమిత. ఈ సందర్భంలో నమితను ‘కొడుకు లాంటి కూతురు’ అని చెప్పుకుంటారేమో. కానీ కొడుకా– కూతురా అని కాదు చూడాల్సింది. తల్లిదండ్రుల బాధ్యతను నిర్వర్తించిన బిడ్డ మాత్రమే. ఒక మహోన్నత వ్యక్తిత్వ ఆలయ ప్రాంగణంలో విరిసిన శాంతి కుసుమం ఆమె. తండ్రి ఆచరించిన, ఆయన నుంచి తాను నేర్చుకున్న సిద్ధాంతాలను కూతురు నీహారికలో చూసుకోవడానికి ప్రయత్నిస్తున్న తల్లి.
తల్లి కశ్మీరీ పండిట్
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మూలాలున్న కశ్మీర్‌లోనే నమిత తల్లి రాజ్‌కుమారి కౌల్ మూలాలు కూడా ఉన్నాయి. కశ్మీర్ పండిట్ కుటుంబం వీరిది. మోతీలాల్ కుటుంబంతో దాయాది బంధం ఉన్న కుటుంబం. ఇందిరాగాంధీకి సెకండ్ కజిన్ అవుతారు రాజ్‌కుమారి. ఆమె తండ్రి గోవింద్‌నారాయణ్ హస్కర్... సింధియా రాజకుటుంబంలో విద్యాశాఖ వ్యవహారాలు చూసేవారు. అలా ఆమె గ్వాలియర్‌లో చదివారు. అదే లక్ష్మీబాయ్ కాలేజ్ (విక్టోరియా కాలేజ్) లో వాజ్‌పేయి కూడా చదివారు.
భర్త బెంగాలీ
నమిత భర్త రంజన్ భట్టాచార్యది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి. రాజకీయ నేపథ్యం ఉన్న విద్యావంతుల కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రంజన్ పట్నాలో పెరిగారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్‌లో ఎకనమిక్స్ తర్వాత, ఒబెరాయ్ స్కూల్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ డిప్లొమా చేసి, అదే ఒమెరాయ్ గ్రూప్‌లో జనరల్‌మేనేజర్‌గా ఉద్యోగం చేశారు. తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి, మనాలిలో హోటల్‌తో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment