రాష్ట్రాల భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం స్థానంలో నూతన సంస్థ ఏర్పాటుపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రధాని నిర్వహించిన సీఎంల సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్రం ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగా బీజేపీ పాలిత, ఇతర పార్టీలపాలిత రాష్ట్రాలు స్వాగతించాయి. సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు ఏమన్నారంటే.
రాష్ట్రాలపై కేంద్రం ఆర్థిక భారం: అఖిలేష్
రాజ్యాంగం నిర్వచించిన ‘రాష్ర్ట జాబితా’ పరిధిలోని అంశాలపై కేంద్ర పథకాలను రూపొందిస్తూ రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతోందని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. కేంద్ర పథకాల వల్ల రాష్ట్రాల ఆర్థిక వనరులపై అనవసర ఒత్తిడి పెరుగుతోందన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను అమలు చేసుకునేలా పూర్తి స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
సమాఖ్యను నిర్లక్ష్యం చేయడమే: చాందీ
జాతీయ అభివృద్ధి మండలి సమావేశం ఏర్పాటు చేయకుండా, రాష్ట్రాలను సంప్రదించకుండా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేస్తూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సమాఖ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేయడమేనని కేరళ సీఎం చాందీ మండిపడ్డారు. కొత్త సంస్థ ఏర్పాటు ప్రతిపాదనను తెలివితక్కువ చర్యగా అభివర్ణించారు.
కొత్త సంస్థ అవసరంలేదు: సిద్ధరామయ్య
కాలానుగుణంగా మార్పులకు తట్టుకొని నిలబడ్డ ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాల్సిన అవసరం ఏముందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. రాబోయే సంస్థలో రాష్ట్రాల సీఎంలకు ప్రాతినిధ్యం కల్పించాలని తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం డిమాండ్ చేశారు.దేశ ఆర్థిక అవసరాలకు తగిన నూతన వ్యవస్థను రూపొందించకుండానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం వల్ల మంచికన్నా చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త సంస్థకు మద్దతిస్తాం: రమణ్‌సింగ్
కొత్త సంస్థ మద్దతిస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ తెలిపారు. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతీయ మండళ్ల ఏర్పాటును మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రతిపాదించారు. నూతన సలహా మండలిని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సూచించారు. కాగా, భేటీకీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత తోపాటు మిజోరం సీఎం లాల్ తన్హావ్లా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గైర్హాజరయ్యారు.