దొంగతనం చేయడానికే ఈ గుడికి వెళ్లాలి!
రూర్కీ: గుడికి వెళ్లి దొంగతనం చేయాలని ఎవరూ అనుకోరు. కానీ అక్కడ గుడికి మాత్రం దొంగతనం చేయడానికే వెళ్లాలి. దొంగతనం చేస్తేనే అక్కడున్న అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఇంతకీ ఎక్కడా గుడి? ఏంటా ఆచారం అని అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలోని చేడియాల అనే గ్రామంలో చూడామణి ఆలయం ఉంది. పిల్లలు లేని వాళ్లు ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
పిల్లలు కావాలని అనుకునేవారు అక్కడ దొంగతనం చేయాలి. దొంగతనం అంటే డబ్బూ నగలూ అనుకునేరు.. అవి కాదండి. దేవతానుగ్రహం పొందాలంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఓ చెక్క బొమ్మను దంపతులు అపహరించాలి. అలా దొంగలించిన తరువాత పిల్లలు పుట్టగానే మళ్లీ ఆలయానికి వచ్చి ఆ బొమ్మతో పాటు మరో ప్రతిమను కూడా అక్కడే పెట్టాలి. వింతగా ఉంది కదూ ఆచారం.