మూడురోజుల్లో ఇరవై లక్షలు
ముంబై: మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి ఈ ఉదంతం ఓ ఉదాహరణ. దేశం కాని దేశంలో ఆత్మహత్య చేసుకున్న కొడుకు మెల్విన్ కోసం ఆవేదన పడుతున్న ఓ వృద్ధ తండ్రిని నెటిజన్లు ఆదుకున్న వైనం ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపించింది.
వివరాల్లోకి వెళితే...ముంబయికి చెందిన లూయిస్ ఫెర్నాండెజ్(68) కోటి ఆశలతో పెంచుకున్న కొడుకు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పదేళ్ల క్రితం అమెరికాకు పంపించాడు . విమానం ఎక్కిస్తూ ఆఖరిసారి చూసిన కొడుకును మళ్లీ ఎపుడెపుడు చూద్దామా అని అతడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఇంతలో కొడుకు ఆత్యహత్య చేసుకున్నాడనే విషాద వార్తను లూయిస్ ఫెర్నాండెజ్ అందుకున్నాడు.
అయితే మెల్విన్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలన్నా, తన బిడ్డను కడసారి కళ్లారా చూద్దాలన్నా లూయిస్ ఫెర్నాండెజ్ చేతిలో చిల్లిగవ్వలేదు . ముంబైలోని వర్లిలో ఓ మామూలు డ్రైవర్గా పనిచేసే అతనికి అంత స్థోమత లేదు దీంతో తనకిక జీవితమే లేదని కుంగిపోయాడు. ఆ పెద్దాయన పరిస్థితిని గమనించిన కొంతమంది పెద్దలు, స్నేహితులు ఆన్లైన్ ద్వారా విరాళాల సేకరణకు ప్రయత్నించారు.
దీంతో దాతల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే సుమారు ఇరవై లక్షల రూపాయల విరాళాలు పోగయ్యాయి. దాతల్లో వారి బంధువులతో పాటు, దేశవిదేశాలకు చెందిన వారు కూడా ఉండటం విశేషం. పెద్దమనసుతో విరాళాలు ఇచ్చిన వారందరికీ ఫెర్నాండెజ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.