ఉత్తరాదిలో భూకంపం
జమ్మూ, కశ్మీర్, ఢిల్లీతోపాటు పలుచోట్ల ప్రకంపనలు
ఢిల్లీలో ఆగిన మెట్రో సేవలు
♦ రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదు
న్యూఢిల్లీ/సూరత్: ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో భూమి కంపించింది. అఫ్గానిస్తాన్‌లోని హిందూకుష్ పర్వతాల్లో వచ్చిన భూకంప ప్రభావంతో ఉత్తర భారతంలో ప్రకంపనలు భయాందోళనలు కలిగించాయి. ఆదివారం మధ్యాహ్నం భూమి కంపించటంతో (6.8 తీవ్రతతో) ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ అధికారులు వెల్లడించారు. దక్షిణ గుజరాత్‌లోని సూరత్, తపీ జిల్లాల్లో కూడా భూమి కంపించింది.
కాగా, ఉత్తరాదిని కుదిపివేసిన భూకంప కేంద్రం హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 190 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించామని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. జమ్మూ, కశ్మీర్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో కూడా ప్రకంపనల ప్రభావం కనిపించింది. ‘ఆరో అంతస్తులో ఫర్నిచర్, పూల కుండీలు ఊగిపోవడం గమనించాను. భయమేసింది. అంతా బాగుండాలని కోరుకుంటున్నాను’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు. ప్రకంపనల కారణంగా ఢిల్లీ మెట్రో రైలు సర్వీసులను కొద్దిసేపు నిలిపివేశారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కోసం మొహాలీలోని ఓ హోటల్‌లో బసచేసిన గుజరాత్ లయన్స్ జట్టు రూములు ఖాళీ చేసి బయటకు వచ్చింది.
పాక్‌లో ఆరుగురి మృతి
అఫ్గాన్ భూకంప ప్రభావంతో పాక్‌లో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. దీని కారణంగా ఆరుగురు మృతిచెందారని, పెషావర్‌లో 28 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ భూమి కంపించింది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 15 సెకన్లపాటు భూమి తీవ్రంగా కంపించిందని అధికారులు తెలిపారు.