విద్యార్థుల చేరిక ఇంత తక్కువా..!
♦ తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన
♦ 400 పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడంపై తీవ్ర ఆవేదన
♦ విద్యార్థులను స్కూల్లో చేర్చేందుకు తీసుకున్న చర్యలు తెలపాలని ఆదేశం
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లలో చేరేలా ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలేమిటో తమకు తెలియచేస్తూ నివేదిక సమర్పించాలని తెలంగాణ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చేందుకు ఉపాధ్యాయులను నియమించడం.. విద్యా నాణ్యతను పెంచడం వంటి చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నా... వాటివల్ల సమస్య పరిష్కారం కాలేదని వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ జేకే రాజు అనే వ్యక్తి మరికొందరు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2015-16 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 18,139 ప్రాథమిక పాఠశాలల్లో 398 స్కూళ్లలో విద్యార్థులు లేరని, మరో 980 పాఠశాలల్లో 1-10 మంది మాత్రమే ఉన్నారని, 2,333 స్కూళ్లలో 11-20 మంది విద్యార్థులే ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలియజేయడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తిసింగ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
విద్యార్థులు స్కూళ్లలో చేరేలా ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యల పురోగతి ఏమిటో తమకు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలా చేయవచ్చని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పీవీ శెట్టి వాదనలు వినిపిస్తూ.. విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, విద్యార్థుల ఇళ్ల నుంచి స్కూళ్లకు రవాణా సదుపాయం, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల స్కూల్ యూనిఫామ్‌లు, తొమ్మిదో తరగతి వరకూ నో డిటెన్షన్ విధానం వంటి అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మెచ్చుకోదగినవేనని, అయితే సమస్య పరిష్కారానికి ఇవి సరిపోవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను నిశితంగా పరిశీలించాలని, ఇవి తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహిస్తాయని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను గుర్తుంచుకోవాలని సూచించింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 13కు వాయిదా వేసింది.