ఎంసెట్ ఫలితాల తర్వాతే ‘ప్రైవేటు’ కౌన్సెలింగ్
- అంగీకరించిన ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు
- సుప్రీంకోర్టు గడువిస్తే ప్రభుత్వ కౌన్సెలింగ్‌ను ముందే నిర్వహించాలంటున్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3 మెడికల్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాతే.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రైవేటు కాలేజీలు కూడా అంగీకరించాయి. వాస్తవానికి ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో మెడికల్ సీట్ల భర్తీ రాష్ట్రంలో ఆలస్యమైంది. అయితే ‘నీట్’ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రైవేటు కాలేజీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇందుకోసం ఈ నెల రెండో వారంలోనే కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ ఇవ్వాలని భావించాయి. కానీ దీనిపై విమర్శలు రావడం.. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) జోక్యంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో చర్చించారు. ఎంసెట్-3 ఫలితాలు వెలువడ్డాకే యాజమాన్య కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించగా.. కాలేజీల యాజమాన్యాలు అంగీకరించాయి. ఎంసెట్-3 ఫలితాలు ఈ నెల 15 తర్వాత విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత ప్రైవేటు కాలేజీలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ప్రయోజనం అంతంతే!
ఎంసీఐ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఆఖరు నాటికి వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికావాలి. అయితే రాష్ట్రంలో ఎంసెట్-3 పరీక్ష సెప్టెంబర్ 11న జరగనుంది. ఆ ఫలితాలు ప్రకటించి, ర్యాంకులు వెల్లడించడం, కౌన్సెలింగ్ నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వంటి ప్రక్రియంతా గడువులోగా పూర్తవడం కష్టం. ఈ నేపథ్యంలో అడ్మిషన్ల గడువు పెంచాలని సుప్రీంకోర్టులో కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ పిటిషన్ దాఖలు చేయనుంది. మరోవైపు ఎంసెట్-3 ఫలితాలు వెలువడగానే యాజమాన్య కోటా సీట్ల భర్తీకి రంగం సిద్ధమవుతోంది.
సుప్రీంకోర్టు ఒకవేళ గడువు పెంచే అవకాశముంటే.. ముందే ప్రైవేటు కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం ఎందుకు అవకాశమిస్తోందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాకే... ప్రైవేటు కాలేజీల్లోని యాజమాన్య, ఎన్నారై కోటా సీట్లను భర్తీ చేస్తే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు గడువు పొడిగించకుంటే.. ఈ నెలాఖరులోగానే ఎలాగోలా కౌన్సెలింగ్ పూర్తిచేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. యాజమాన్య కోటా సీట్లను ఒకే కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తారు.