వరదలను దాటుకొని స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులు
దిస్‌పూర్ (అస్సాం) : చిరునవ్వులు చిందిస్తూ బడికి వెళ్లాల్సిన బాల్యం.. బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తోంది. చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రోడ్డుని దాటుతూ ప్రమాదపుటంచులలో పయనం సాగిస్తోంది. దరంగ్ జిల్లాలో గల దాల్‌గావ్‌లో కల్వర్టు నిర్మాణం నిర్లక్ష్యానికి గురవడంతో.. కొద్దిపాటి వర్షానికే రెండు గ్రామాల మధ్యనున్న లింకు రోడ్డు నీట మునిగిపోయింది. దీంతో తల్లిదండ్రుల సాయంతో అయిదడుగుల లోతు నీటి కాలువను దాటుకుని ప్రైమరీ స్కూల్ విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. తాటి బొదల సాయంతో 5 అడుగుల నీటిలో ప్రయాణం చేస్తున్న చిన్నారుల ‘సాహస యాత్ర’అక్కడి అధికార యంత్రాగాన్ని వేలెత్తి చూపుతోంది.
ఈ-పాఠాలు చెప్పించండి
రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబాలు పిల్లలను పాఠశాలలో దింపడానికి, తిరిగి తీసుకురావడానికి రోజంతా పని వదులుకోవాల్సి వస్తోందని వాపోతున్నాయి. పనికోసం చూసుకొని పిల్లలని ఒంటరిగా బడికి పంపితే ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశాన్ని డిజిటల్ మయం చేస్తానని చెప్తున్న ప్రధాని మోదీ ఈ పిల్లలకు ఈ-పాఠాలు చెప్పిస్తే సరిపోతుంది కదా అని ట్విటర్లో కొందరు కాంమెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment