సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన నేపథ్యంలో తలెత్తిన వివాదాల పరిష్కారంపై పనిచేస్తున్న కమిటీకి సాయం అందించేందుకు కేంద్ర హోంశాఖ ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న వివాదాలు, ఇబ్బందులను పరిష్కరించే అంశాలపై దృష్టి పెడుతుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి కుమార్ అలోక్ దీనికి నేతృత్వం వహిస్తారు. ఇరు రాష్ట్రాల నుంచి పునర్‌వ్యవస్థీకరణ కార్యదర్శులు, ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్లు, రెండు రాష్ట్రాల శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
అవసరమైన సందర్భాల్లో కేంద్రంలోని సంబంధిత (వివాదానికి సంబంధించి) మంత్రిత్వశాఖ ప్రతినిధి కూడా ఉంటారు. ఈ మేరకు కార్యాలయ మెమోను కేంద్ర, రాష్ట్ర సంబంధాల అండర్ సెక్రటరీ ఏకే మనీష్ ఈ నెల 12న జారీ చేశారు. ఈ సబ్ కమిటీ ఈ నెల 26న సమావేశం కానున్నట్టు సమాచారం.