నేతాజీ ప్రేమ పెళ్లి చేసుకున్నారా?
నేతాజీగా ప్రసిద్ధి చెందిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. భారత స్వాతంత్య్ర సాధనకై గాంధీజీ వంటి నాయకులు అహింసావాదాన్ని ఎంచుకుంటే, బోస్ మాత్రం సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు. ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగే అతికొద్దిమందిలో ఈయన అగ్రగణ్యులు. నేతాజీ మరణం నేటికీ ఓ మిస్టరీనే. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా వాదప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. బోస్‌కు చెందిన కొన్ని రహస్య పత్రాలను తాజాగా బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టడంతో దేశమంతా మరోమారు ఆయన్ను జ్ఞప్తికి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్ జీవిత విశేషాలు తెలుసుకుందాం..!
బాల్యం..
సుభాష్ చంద్రబోస్ 1897లో నాటి బెంగాల్ ప్రావిన్సులోని కటక్‌లో (ఒడిశా) జన్మించారు. తండ్రి జానకీనాథ్ బోస్ పేరొందిన లాయరు. కరడుగట్టిన జాతీయవాది. ఈయన బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు కూడా ఎన్నికయ్యారు. తల్లి ప్రభావతి. సంపన్న కుటుంబంలో జన్మించిన బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలు, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజి, ఫిట్జ్ విలియం కాలేజి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలలో సాగింది. 1920లో భారత సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై నాలుగో ర్యాంకు సాధించారు. ఆంగ్లంలో అత్యధిక మార్కులు పొందారు. అయితే, 1921లో భారత స్వాతంత్య్ర ఉద్యమం కోసం సివిల్ సర్వీసు నుంచి వైదొలిగారు.
ప్రేమ.. పెళ్లి..
బోస్ ఐరోపాలో ఉండే సమయంలో ఆస్ట్రియా దేశస్తురాలైన ఎమిలీ షెంకెల్‌ను ప్రేమించారు. ఈమెనే 1937 డిసెంబర్ 26న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 1942లో అనిత జన్మించింది. బోస్ తన భార్యకు రాసిన ఎన్నో ఉత్తరాలను ‘లెటర్స్ టూ ఎమిలీ షెంకెల్’ పేరుతో సంకలనంగా అతని మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్, సుగతా బోస్ ప్రచురించారు.
కాంగ్రెస్‌లో..
భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించిన బోస్‌ను సహాయ నిరాకరణ సమయంలో గాంధీజీ కలకత్తా పంపారు. అక్కడ చిత్తరంజన్ దాస్‌తో కలిసి బెంగాల్ ఉద్యమం నిర్వహించారు బోస్. ఉద్యమాల్లో చురుగ్గా ఉంటూ 1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, ఈ ఎన్నిక గాంధీకి రుచించలేదు. బోస్ ప్రత్యర్థి పట్టాభి రామయ్య పరాజయాన్ని గాంధీజీ తన పరాజయంగా భావించారు. ఇలా పార్టీలో ఏర్పడిన సంక్షోభం కారణంగా బోస్ కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ప్రత్యామ్నాయంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు.
స్వాతంత్య్ర ప్రణాళిక..
బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరాక స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ లాంటి నేతలు భావించేవారు. అయితే, బోస్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉండేవి. రెండో ప్రపంచయుద్ధంలో తలమునకలై ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికి అదే సరైన సమయమని బోస్ నమ్మేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశం కనీసం రెండేళ్లపాటు సోషలిస్టు నియంత్రణలో ఉండాలని ఆయన కోరుకున్నారు. స్వతంత్ర సాధన కోసం బోస్ ఎందరో బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నారు. అయితే, అప్పుడు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ నేతలు బోస్‌ను కలిసేందుకు ఇష్టపడలేదు. తర్వాతికాలంలో లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించడం గమనార్హం.
అజ్ఞాతంలోకి..
కాంగ్రెసును సంప్రదించకుండా భారత్‌ను బ్రిటిష్ వారు యుద్ధంలోకి దింపడం బోస్‌కు మింగుడుపడలేదు. వెంటనే ఆయన నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన బ్రిటిష్ ప్రభుత్వం, తరువాత విడుదల చేసి ఇంటి చుట్టూ నిఘా ఉంచింది. తనను దేశం దాటి బయటకు వెళ్లనీయకుండా కుట్ర జరుగుతుందని గ్రహించిన బోస్.. మారువేషంలో దేశం దాటారు. బ్రిటిష్ వారికి శత్రువులైన జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాలతో చేయి కలపాలని, తద్వారా స్వాతంత్య్రం సాధించాలని నిర్ణయించుకున్నారు. అయితే, దీనిపై చాలా విమర్శలు ఉన్నాయి.
అనుమానాస్పద మరణం..
అధికారిక ప్రకటన ఆధారంగా బోస్ 1945, ఆగస్టు 18న మరణించారు. తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన మరణించారని చెబుతారు. అయితే, ఆయన శవం మాత్రం దొరకలేదు. దీంతో ఆయన బతికే ఉన్నారన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ బందీగా ఉండగా సైబీరియాలో బోస్ మరణించారనే కథనంపై భారత ప్రభుత్వం విచారణకు చాలా కమిటీలను నియమించింది.
సన్యాసిగా..?
1985లో అయోధ్య సమీపంలోని ఫైజాబాదులో సంచరించిన భగవాన్‌జీ అనే సన్యాసే బోస్ అని చాలామంది నమ్మేవారు. ‘మారువేషంలో ఉన్న బోస్‌ని’ అని కనీసం నాలుగు సార్లు ఆయన చెప్పుకొన్నారు. భగవాన్‌జీ మరణానంతరం అతని వస్తువులను ప్రభుత్వం నియమించిన ముఖర్జీ కమిటీ పరిశీలించింది. అందులో స్పష్టమైన ఆధారాలేవీ దొరక్కపోవడంతో ఈ వాదనను కమిటీ కొట్టివేసింది. తర్వాతి కాలంలో పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో కమిటీ నిర్ణయం తప్పని తేలడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.