
రజనీ.. రాజకీయాల్లోకి రావద్దు!
'దేవుడు శాసిస్తే.. నేను రాజకీయాల్లోకి రావచ్చు' అని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పడాన్ని ఒక పొలిటికల్ జోక్‌గా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి అభివర్ణించారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని సలహా ఇచ్చారు. రజనీకాంత్‌కు స్పష్టమైన సిద్ధాంతం లేదని, ఆయన గతంలో వేర్వేరు పార్టీలతో కలిశారు తప్ప అందులో సిద్ధాంతాలు పాటించలేదని, ఆయన తరచు నిర్ణయాలు మార్చుకుంటారని స్వామి అన్నారు. అయితే.. ఒకవైపు స్వామి ఇలా చెబుతున్నా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్.గురుమూర్తి తదితరులు మాత్రం రజనీకాంత్‌తో టచ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో చేరచ్చు అన్న రజనీ వ్యాఖ్యలను గురుమూర్తి స్వాగతించారు.
రజనీ బాగా ఆలోచించి మాత్రమే మాట్లాడుతున్నారని, ఆయన అచ్చం మోదీలాగే చెబుతున్నారని కూడా అన్నారు. అయితే సుబ్రమణ్యం స్వామికి మాత్రం ఎందుకో రజనీ కామెంట్లు పెద్దగా నచ్చినట్లు లేవు. అసలు గట్టిగా మాట్లాడితే రజనీకాంత్ తమిళుడే కాదని, బెంగళూరు నుంచి వచ్చిన మరాఠీ వ్యక్తి అని స్వామి వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌కు అభిమానులు ఉన్నారంటే వాళ్లు ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినవాళ్లు కారని, ఓ గుంపులా ఆయనను ఆరాధిస్తున్నారని అన్నారు. ప్రకటనలు చేయడంలో సినిమావాళ్లు దిట్టలని, ఎందుకంటే వాళ్లకు డైలాగులు వేరే ఎవరో రాసిస్తారని స్వామి మండిపడ్డారు.