
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి (ఫైల్‌ఫోటో)
అల్లర్లు కాంగ్రెస్ పనేనని సుబ్రహ్మణ్య స్వామి అనుమానం..
లక్నో : పోలీస్ అధికారి సహా ఇద్దరు మరణించిన బులంద్‌షహర్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వానికి మచ్చ తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ వ్యక్తులే ఈ అల్లర్లకు కుట్ర జరిపారా అనేది తాము తేల్చుతామని స్వామి చెప్పుకొచ్చారు.
యూపీ తగలబడుతుంటే యోగి ఆదిత్యానాథ్ ప్రచారంలో బిజీగా మారారనే కాంగ్రెస్ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లలో భారత్ తగులబడలేదా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీలో ఎలాంటి విచారణ లేకుండానే వేలాది మంది అమాయక ప్రజలను జైళ్లలో నిర్భందించిన కాంగ్రెస్ యూపీ సీఎంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.
యూపీలోని బులంద్‌షహర్‌లో గోవధ వదంతుల నేపథ్యంలో హింసాత్మక నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అల్లరిమూకలు పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలకు నిప్పంటించి రాళ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. అల్లర్ల ఘటనలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబోధ్ వర్మ సహా స్ధానిక యువకుడు మరణించారు.