సాక్షి, పెరంబూరు : నటుడు కమలహాసన్ ఇప్పటికే పార్టీని ప్రారంభించి రాజకీయాల్లో ఉన్నారు. ఇక రజనీకాంత్ త్వరలో రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సినీ రంగంలో మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ కలసి పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందన్న అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. ఇటీవల సీనియర్ దర్శకుడు, నటుడు విజయ్ తండ్రి ఎస్‌ఏ.చంద్రశేఖర్ అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కాగా ఇదే అంశంపై కమలహాసన్ అన్నయ్య కూతురు, నటీ సుహాసినిని ఇటీవల ఒక టీవీ ఛానల్ ప్రశ్నించింది. ఆ భేటీలో రజనీ, కమల్ కలవాలన్న దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ కోరిక గురించి నటి సుహాసిని వద్ద ప్రస్తావించారు. అందుకు ఆమె బదులిస్తూ రజనీకాంత్, కమలహాసన్ కలవాలన్నదే తమందరి కోరిక, ఆశ అని పేర్కొన్నారు.
అయితే ఇది జరుగుతుందా అన్నదే తెలియడం లేదని అన్నారు. ఎందుకంటే తనకు వ్యతిరేక ఆలోచనలు కలిగిన వ్యక్తులతో ఒకే రూమ్‌లో ఐదు నిమిషాలు కూడా ఉండలేనన్నారు. కాబట్టి ఆశ పడడం సులభం అని అది నిజం అవడమే కష్టమని అన్నారు. అది మీరి వారిద్దరూ కలిస్తే తమిళనాడుకే మంచిదని అన్నారు. కమల్, రజనీ కుంటుంబాలు ఒకే నేపథ్యానికికు చెందిన వారన్నది తెలిసిందేనన్నారు. కమలహాసన్‌కు చెందిన కార్యక్రమాల కంటే రజనీకాంత్ కుటుంబానికి చెందిన కార్యక్రమాల్లోనే తాను తన తండ్రి చారుహాసన్ అధికంగా పాల్గొన్నామని, ఇదే చాలా మందికి ఆసక్తిని కలిగించే విషయమని అన్నారు. ఏదేమైనా కమల్, రజనీ రాజకీయపరంగా కలిస్తే అంతకంటే మంచి విషయం ఏముంటుందీ అన్నారు.
అయితే ఇక్కడ ఎవరి సిద్ధాంతాలు వారికుంటాయన్నారు. అలా వారు వారి సిద్ధాంతాలకనుగుణంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని సుహాసిని పేర్కొన్నారు. సినీరంగంలో రెండు ధ్రువాలుగా ఉన్న కమల్, రజనీ రాజకీయాల్లో ఒకటవడం సాధ్యమా అన్న ప్రశ్నకు బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్ కలిసి నటించలేదని, అలాగని వారిద్దరు రెండు ధ్రువాలు అని చెప్పగలమా అని ప్రశ్నించారు. సింపుల్ లాజిక్ ఏమిటంటే రెండు బలాలు ఒకే చోట ఉంచే కంటే పక్క పక్కన ఉంటే మరింత బలం చేకూరుతుంది అని అన్నారు. కమల్, రజనీ రాజకీయంగా కలవాలన్నది తమ ఆశనే కాకుండా, తమిళ ప్రజల కోరిక అని సుహాసిని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment