లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహాజన్!
న్యూఢిల్లీ : 16వ లోక్ సభ స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్(71) పేరు ఖరారు అయినట్లు సమాచారం. పార్లమెంటరీ వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న ఆమెను శుక్రవారం జరిగే పార్లమెంటు సమావేశాల్లో అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన సుమిత్రాసేన్ (సుమిత్రా మహాజన్) భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నాయకురాళ్లలో ఒకరు. ఇండోర్ నియోజకవర్గం నుంచి సుమిత్రా మహాజన్ వరుసగా 8వసారి ఎంపీగా గెలుపొందారు.
1989లో తొలిసారి విజయం సాధించి 9వ లోక్‌సభలో అడుగుపెట్టారు. అది మొదలు ఇప్పుడు 16వ లోక్‌సభ వరకు ఆమె ప్రస్థానంలో ఓటమి అంటూ ఎక్కడా లేదు. గతంలో ఆమెకు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం వచ్చినట్లే వచ్చి రాజకీయ సమీకరణల్లో చివరి నిమిషంలో చేజారింది. పెట్రోలియం శాఖా సహాయ మంత్రిగా పనిచేసిన తొలి మహిళా పార్లమెంట్ సభ్యురాలు. ఆలోచించి గానీ ఏ నిర్ణయమైనా తీసుకోరనే పేరు పార్టీలో సుమిత్రా మహాజన్‌కు ఉంది.
లాయర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె బీజేపీలో తనదైన ముద్ర వేసుకున్నారు. స్థానిక ప్రజలు సుమిత్రా మహాజన్ను తాయ్ (అక్క) అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆమె కీలప పాత్ర పోషించారు. 2002-04 వరకు హ్యుమన్ రిసోర్స్‌స్, కమ్యూనికేషన్ పెట్రోలియం శాఖలకు సహాయ మంత్రిగా విధులు నిర్వహించారు. భర్త జయంత్ మహాజన్, ఇద్దరు కుమారులు ఉన్నారు.