
శశి థరూర్
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రి ప్రశ్నించారు. గత జనవరిలో సునంద మృతి చెందిన విషయం తెలిసిందే. ఏడాది తరువాత ఢిల్లీ పోలీసులు ఆయనను ప్రశ్నించారు. విష ప్రయోగంతో సునంద చనిపోయినట్లు ఎయిమ్స్ ఇచ్చిన వైద్య నివేదిక ఆధారంగా మూడు వారాల క్రితం ఢిల్లీ పోలీసులు హత్యాకేసుగా నమోదు చేశారు. గత సంవత్సరం జనవరి 17న ఢిల్లీలోని ప్రఖ్యాత లీలా హోటల్ గదిలో సునంద మృతదేహం కనిపించింది. ఆ తరువాత శశి థరూర్‌ను పోలీసులు ప్రశ్నించడం ఇదే ప్రథమం. థరూర్‌ను అదనపు డీసీపీ పీఎస్ కుష్వా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది.
సోమవారం రాత్రి 8 గంటలకు దక్షిణ ఢిల్లీలోని సిట్ కార్యాలయానికి థరూర్ వెళ్లారు. అంతకుముందు ఆయన తన న్యాయవాదులతో సమావేశమయ్యారు. 'సునంద మరణించిన జనవరి 17న ఏం జరిగింది? అంతకు ముందు జనవరి 15న తిరువనంతపురం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత థరూర్‌ను వదిలేసి సునంద ఒంటరిగా హోటల్ గది ఎందుకు తీసుకున్నారు? సునంద ఆరోగ్య పరిస్థితి ఏంటి? పాకిస్తానీ జర్నలిస్ట్ మెహర్ తరార్‌తో థరూర్ సంబంధాలేంటి?' తదితర అంశాలపై థరూర్‌ను ప్రశ్నించి ఉండవచ్చునని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటివరకు సిట్ అధికారులు థరూర్ పనిమనిషి నారాయణ్ సింగ్, స్నేహితుడు సంజయ్ దేవన్, హోటల్ డాక్టర్, హోటల్ సిబ్బందిని విచారించారు. వారు చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చనిపోవడానికి ముందు సునంద మాట్లాడారని భావిస్తున్న ఒక మహిళా జర్నలిస్టును కూడా సిట్ త్వరలో ప్రశ్నించనుంది.