పోలీస్ బాస్ నిజాలను దాస్తున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ భార్య (53) సునంద పుష్కర్ మృతి వ్యవహారాన్ని బీజేపీ అస్త్రంగా మలుచుకుంటోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. సునంద పుష్కర్ అనుమానాస్పద మరణంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ వాస్తవాలను మీడియాకు వెల్లడి చేయలేదని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. నిజాలను ప్రపంచానికి చెప్పకుండా దాచిపెడుతున్నారని ఆయన విమర్శించారు. సునంద కేసులో వాస్తవాలు వెల్లడిచేయడంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ స్వామి ప్రశ్నించారు.
ప్రమాదకరమైన కెమికల్ అవశేషాలు సునంద విసేరాలో లభ్యమయ్యాయన్న ఎఫ్బీఐ రిపోర్టు సమర్పించిందన్నారు. భయంకరమైన విషపదార్థాన్ని ఇంజక్షన్ ద్వారా ఇవ్వడం వల్ల ఆమె మరణం సంభవించి ఉంటుందన్న ఆ రిపోర్టును ఎందుకు మీడియాకు బహిర్గతం చేయడంలేదంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.
దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన సునంద మరణం సహజమైంది కాదని ఢిల్లీ బాస్ బీఎస్ బస్సీ శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించడంతో సునంద పుష్కర్ భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్ ఇరకాటంలో పడ్డారు. కాగా 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎన్నో మలుపులు తిరిగిన సునంద మృతిపై పోలీసులు పలుమార్లు సునంద భర్త శశిథరూర్ తో సహా.. పలువురిని విచారించిన విషయం తెలిసిందే.