
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని సున్‌జ్వాన్‌లో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న భద్రతా దళాల ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా.. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.
సున్‌జ్వాన్‌లోని ఆర్మీ క్యాంప్‌పై శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇద్దరు ముష్కరులను జవాన్లు మట్టుబెట్టారు. దాడిలో మొత్తం నలుగురు వరకు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు తెలుస్తుండగా.. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం సున్‌జ్వాన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ క్యాంపునకు 500 మీటర్ల వెలుపల ఉన్న అన్ని స్కూళ్లను మూసివేయాల్సిందిగా ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడితో కేంద్రహోం శాఖ అప్రమత్తమైంది. జమ్మూ కశ్మీర్ డీజీపీతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment