సూపర్ సూట్‌తో మీ పిల్లలు ఫిట్
న్యూఢిల్లీ: టీవీల్లో కార్టూన్ సీరియళ్లు, మొబైల్స్‌లో వీడియో గేమ్స్ అంటూ స్క్రీన్‌లకు అతుక్కుపోయే పిల్లలు శారీరకంగా ఎంతగా బలహీనంగా తయారవుతున్నారో తెలిసిందే. కారణం శరీరాన్ని ఉత్తేజంగా, శక్తిమంతంగా ఉంచే అవుట్‌డోర్ గేమ్స్‌కు వారు దూరం కావడమే. అయితే ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉందంటోంది అమెరికాకు చెందిన ఓ గేమ్స్ డిజైన్ సంస్థ.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఓ సూపర్ సూట్‌ను తయారు చేశామని, ఇది పిల్లలకు అవుట్‌డోర్ గేమ్స్‌పై ఆసక్తి పెంచడమే కాకుండా ఫిట్‌నెస్‌గా తయారు చేస్తుందని చెబుతున్నారు. ఈ సూట్ ధరించిన పిల్లల ఫిట్‌నెస్ ఎంతో తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకునేలా ఓ యాప్‌ను కూడా రూపొందించామని తయారీదారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనిని మార్కెట్‌లోకి విడుదల చేస్తామని, పిల్లలంతా అవుట్‌డోర్ గేమ్స్‌ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తోంది.