
దేశంలో నాలుగు చోట్ల సుప్రీం బెంచ్‌లు ఉండాలి
దేశంలో నాలుగు దిశల్లోని నాలుగు ప్రాంతాల్లో సుప్రీం కోర్టు ధర్మాసనాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రానికి సూచన చేశారు.
లోక్‌సభలో ఎంపీ వినోద్‌కుమార్ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నాలుగు దిశల్లోని నాలుగు ప్రాంతాల్లో సుప్రీం కోర్టు ధర్మాసనాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రానికి సూచన చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని లోక్‌సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ‘సుప్రీం కోర్టు దేశంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లోని నాలుగు ప్రాంతాల్లో ధర్మాసనాలు కలిగి ప్రజలకు న్యాయసేవలు అందించాలి. ఈరోజు ఒక కేసు సుప్రీం కోర్టుకు వెళ్లాలంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడి ఉంటోంది.
విభిన్న ప్రాంతాల్లో ధర్మాసనాలు ఉండాలని అడిగితే ఇందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అందువల్ల ధర్మాసనాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్రపతికి అధికారం దఖలు పరిచేలా ఆర్టికల్ 130ని సవరించాలి..’ అని సూచించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశంలో భవిష్యత్ పరిణామాలను ముందే ఊహించి రాష్ట్రాల విభజన సమయంలో మెజారిటీ, మైనారిటీ ని పరిగణనలోకి తీసుకోకుండా, అసెంబ్లీ తీర్మానానికి కట్టుబడి ఉండాల్సిన పనిలేకుండా ఆర్టికల్ 3ను రూపొందించారని. అందువల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు.