‘హిందుత్వ’ తీర్పును మళ్లీ పరిశీలించం: సుప్రీం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి 1995నాటి వివాదాస్పద తీర్పు పునఃపరిశీలనకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ‘హిందుత్వ’ తీర్పుగా పేరొందిన ఆ తీర్పుపై మంగళవారం స్పందిస్తూ.. ఈ సమయంలో మతపర విషయాన్ని పరిశీలించబోమని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ స్పష్టం చేసింది. హిందుత్వ అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? అనే విషయంలో పెద్ద చర్చకు వెళ్లబోమని పేర్కొంది. 1995 తీర్పును పునఃపరిశీలించబోమని, హిందుత్వ లేదా మతం అనే దానిని ఈ సమయంలో పరిశీలించబోమని స్పష్టం చేసింది. ఈ సమయంలో తాము విచారించవలసిన విషయానికి మాత్రమే కట్టుబడి ఉంటామని, ఐదుగురు జడ్జీలు సూచించిన విచారణ అంశంలో హిందుత్వ అనే పదం ఉందని ఎవరైనా చూపిస్తే.. వారి వాదన వింటామని బెంచ్ పేర్కొంది.
కాగా, ఐదుగురు జడ్జీల సూచన మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123(3) సెక్షన్ పరిధిని, విస్తృతిని ప్రస్తుత బెంచ్ పరిశీలించాల్సి ఉంది. రాజకీయాల్లో మతాన్ని జోడించకూడదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీచేయాలని, ప్రస్తుత విచారణలో తనకు అవకాశం కల్పించాలని ఓపీ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే విషయంలో తన వాదనలు కూడా వినాలని గతంలో సామాజిక కార్యకర్త తీస్తా సెతెల్వాద్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఉన్నారు.