నిర్భయ దోషులకు సుప్రీంలో షాక్‌! | Supreme Court Dismisses Nirbhaya Convicts Curative Petitions | Sakshi
Sakshi News home page

నిర్భయ దోషులకు సుప్రీంలో షాక్‌!

Published Tue, Jan 14 2020 2:29 PM | Last Updated on Tue, Jan 14 2020 2:36 PM

Supreme Court Dismisses Nirbhaya Convicts Curative Petitions - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు దోషులు వినయ్‌ శర్మ(26), ముఖేష్‌ కుమార్‌(32) దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతంలో దోషులైన ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31)లను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినయ్‌ శర్మ, ముఖేష్‌ కుమార్‌ అత్యున్నత న్యాయస్థానంలో క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం(అరుణ్‌ మిశ్రా, ఆర్‌ఎఫ్‌ నారీమణ్‌, ఆర్‌ భానుమతి, అశోక్‌ భూషణ్‌) వాటిని కొట్టివేసింది. దీంతో నిర్భయ కేసు దోషులను ఉరి తీసేందుకు మార్గం సుగమమైంది.(ఉరి ఖాయం.. ఆరోజే నా కూతురికి న్యాయం)

కాగా 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడి... ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు బాధితురాలు సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది.(నేనొక బండరాయిని.. నాకు భావోద్వేగాలు లేవు)

దోషులు వీరే..
ముఖేష్‌ సింగ్‌: తీహార్‌ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్‌ రామ్‌ సింగ్‌ తమ్ముడే ముఖేష్‌  సింగ్‌ (32). దక్షిణ ఢిల్లీలోని రవిదాస్‌ మురికివాడల్లో సోదరుడితో కలసి నివసించేవాడు అప్పుడప్పుడు తానే ఆ బస్సుని నడిపించేవాడు. క్లీనర్‌గా చేసేవాడు.  ఘటన రోజు ముఖేశ్‌ బస్సు నడిపాడు. అత్యాచారం చేశాక నిర్భయ, ఆమె స్నేహితుడిని ఐరన్‌ రాడ్‌తో చితకబాదాడని ముఖేష్‌పై అభియోగాలు నమోదయ్యాయి.

వినయ్‌ శర్మ: వినయ్‌శర్మ (26) కూడా రవిదాస్‌ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిటినెస్‌ ట్రైనర్‌. ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు.

అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌: అక్షయ్‌ ఠాకూర్‌ (31) బిహార్‌ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు. స్కూల్‌ డ్రాపవుట్‌ అయిన అక్షయ్‌ 2011లో బిహార్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన ఐదు రోజుల తర్వాత అక్షయ్‌ని బిహార్‌లో అరెస్ట్‌ చేశారు.

పవన్‌ గుప్తా: పవన్‌ గుప్తా (25) పండ్ల వ్యాపారి. డిసెంబర్‌ 16 మధ్యాహ్నం మద్యం సేవించి బయటకు వెళ్లాడు. అరెస్ట్‌ చేసిన తర్వాత పవన్‌ తాను చాలా దుర్మార్గానికి పాల్పడ్డానని, తనకి ఉరి శిక్షే సరైనదని కోర్టులో చెప్పుకున్నాడు.

నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు

'గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఆ శిక్ష'

సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్‌ వద్ద ఇంకా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement