విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆస్తుల బదలాయింపుల కేసులో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన జూలై 10న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా మాల్యా వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. ఇంతకు ముందే ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆయనను ఆదేశించినా స్పందించకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది.
ఒకవేళ మ్యాలా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకపోతే ఆయనకు ఆరు నెలలపాటు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మాల్యాకు న్యాయస్థానం తాజా ఆదేశాలతో ఆయన చుట్టు ఉచ్చు బిగుస్తోంది. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.
కాగా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అలాగే డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. వడ్డీసహా దాదాపు రూ.9,000 కోట్ల రుణ బకాయి కేసులో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ పిటిషన్లను దాఖలు చేసింది.