సాక్షి, న్యూఢిల్లీ : మతాచారాలను పాటించడంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉంటాయని, పితృస్వామ్యం పెత్తనాన్ని అనుమతించలేమంటూ శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహళలందరికీ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పిన విషయం తెల్సిందే. ఇలా అనేక సందర్భాల్లో ముఖ్యంగా మతా విశ్వాసాల్లో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాన్ని ఎండగడుతూ సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చింది.
దేశంలోని పలు పవిత్ర మందిరాల్లో మహిళల్ని ఎందుకు అనుమతించడం లేదంటూ మహిళల హక్కుల కార్యకర్తలు న్యాయపోరాటాలు జరిపి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. మహారాష్ట్రలోని శని షింగ్నాపూర్ ఆలయంలోని గర్భగుడిలోకి, త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను ఎందుకు అనుమతించరంటూ భూమాతా మహిళా బ్రిగేడ్‌కు చెందిన నాయకురాలు తృప్తీ దేశాయ్ 2016లో సుప్రీంకోర్టుకెక్కి విజయం సాధించారు. అదే సంవత్సరం ముంబైలోని హాజీ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించకపోవడంపట్ల ముస్లిం మహిళా హక్కుల సంఘం కూడా సుప్రీంకోర్టులో విజయం సాధించింది. ఇదే వరుసలో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల ఆడవాళ్లను అనుమతించాలంటూ సుప్రీంతీర్పు చెప్పింది. రుతుస్రావం సందర్భంగా మహిళలు మైలబడతారన్న కారణంగా పదేళ్లపైన, 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై ఆలయ పూజారులు ఆంక్షలు కొనసాగిస్తున్న విషయం తెల్సిందే.
భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన హక్కులుంటాయన్న మూలసూత్రం కారణంగా దేశంలోని ప్రతి ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ వస్తోంది. ఐదుగురు సభ్యులుగల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పుతో జస్టిస్ హిందూ మల్హోత్రా ఒక్కరే విభేదించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో మతానికి ఒక్కోరకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయని, అవన్నీ స్థానిక ప్రజల నమ్మకాలనీ, వాటిల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేవని ఆమె వాదించారు. పైగా అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడం వల్ల దాని ప్రభావం దేశంలోని అన్ని ఆలయాల ఆచార వ్యవహారాలపై ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఆమె అభిప్రాయంలో అన్ని ఆలయాలపై ప్రభావం ఉంటుందనే పాయింట్ ఒక్కటే తర్కబద్ధంగా ఉంది. ఈ విషయాన్నైనా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని దేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉంటుందని ఒక్కసారే తీర్పు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడే సుప్రీంకోర్టు మరో ముఖ్యమైన విషయాన్ని విస్మరించింది. రుతుస్రావం వల్ల మహిళలు మైలపడతారనే సాంఘిక దురాచారాన్ని పట్టించుకోకపోవడం. ఈ దురాచారం ఇక చెల్లదని ప్రకటించకపోవడం. మైల సందర్భంగా మహిళలను ఒక్క దేవాలయాలకే కాకుండా సాంఘిక, సామాజిక కార్యక్రమాలకు కూడా అనాదిగా దూరం ఉంచుతూ వస్తున్నారు. రుతుస్రావం సందర్భంగా షియా మసీదుల్లోకి మహిళలను అనుమతించరు. భారత్‌లోని సున్నీ మసీదుల్లోకి ఎల్లవేళల మహిళలను అనుమతించరు. పార్శీ అగ్ని దేవాలయాల్లోకి కూడా మహిళలను అనుమతించరు. ఇక ఇళ్లలో రుతుస్రావం సందర్భంగా పూజ గదుల్లోకి మహిళలు వెళ్లరాదు. పవిత్ర గ్రంధాలను తాకరాదు. దైవ స్త్రోత్రాలను చదవరాదు. వంటింట్లోకి వెళ్లరాదు. వంట చేయరాదు. పొరుగింట్లో శుభకార్యాలయాలకు హాజరుకారాదు. హిందూ కుటుంబాలతోపాటు జైన కుటుంబాల్లోనూ ఈ ఆచారం ఇప్పటికీ ఉంది.
ఈ మైల అన్న కారణంగానే పండిట్లు, పూజారులు, కాజీలు, ఇమామ్‌ల పదవులు మహిళలకు ఇవ్వడం లేదు. మహిళల వివక్ష చూపే ఇలాంటి ఆచారాలు సోషల్ మీడియా విస్తరించిన నేటిరోజుల్లో కూడా కొనసాగడం అనాగరికం. ఈ ఏడాది దుర్గా పూజలో మహిళలందరూ పాల్గొనాలని, రుతుస్రావం వచ్చిన వాళ్లూ పాల్గొనవచ్చని శనివారం నాడు ఓ ఫేస్‌బుక్ రీడర్ పిలుపునివ్వగా, ఎంతోమంది నుంచి చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చి పడ్డాయి. మారే కాలం మరెప్పుడో!
Comments
Please login to add a commentAdd a comment