ఇంటర్నెట్ దిగ్గజాలకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలను ఎందుకు అనుమతిస్తున్నారంటూ ప్రశ్నించింది. ఈ సంస్థలకు సంబంధించిన వెబ్ సైట్లలో సామాజిక అనుసంధాన వేదికల్లో లైంగిక నేరాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారని, ఇవి సైబర్ క్రైం పరిధిలోకి రావా? వీటిని నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని? ప్రశ్నించింది. జనవరి 9నాటికి పూర్తి వివరాలు తెలియజేయాలంటూ జస్టిస్ ఎంబీ లోకూర్, యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ప్రజ్వల అనే ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ఈ అంశంపై పిటిషన్ వేసింది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా ఆ వికృత చర్యలను వీడియోలు తీసి ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, ఇలాంటి వాటిపై ఇంటర్నెట్ సంస్థలు ఏం చేస్తున్నాయని, వాటిని తొలగించే చర్యలకు ఎందుకు పాల్పడటం లేదని, అలా చేసేవారిని ఎందుకు సైబర్ నేరస్తులుగా పరిగణించడం లేదని ప్రశ్నిస్తూ ఈ సంస్థ సుప్రీంలో పిటిషన్ వేసింది.
ప్రముఖ న్యాయవాది అపర్నా భట్ ప్రజ్వల తరుపున కోర్టులో వాదనలు వినిపించారు. మరోపక్క, ఈ కేసు నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తరుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ హాజరై కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలకు సంబంధించిన నోడల్ సంస్థ సీబీఐ తీసుకున్న చర్యలను వివరించింది. లైంగిక నేరాలకు పాల్పడే వారి పేర్లను బహిరంగంగా ప్రకటించే అంశంపై చర్చ చేపట్టామన్నారు. అయితే, కేసు పెట్టగానే వారి పేర్లు బహిర్గతం చేయకుండా నేరం రుజువైన తర్వాత శిక్ష విధించిన తర్వాతే వారి పేర్లు బయటపెట్టాలని కోర్టు అభిప్రాయపడింది.