
నీట్‌పై తీర్పు ఉపసంహరణ
► సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
► చర్చించకుండా హడావుడిగా తీర్పునిచ్చారన్న సుప్రీం
► తాజా తీర్పుతో నీట్ నిర్వహణకు సిద్ధమన్న ఎంసీఐ
న్యూఢిల్లీ: వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశపరీక్ష(నీట్)పై 2013లో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు వెనక్కి తీసుకుంది. దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉండాలన్న నిర్ణయాన్ని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. జులై 18, 2013న 2-1 తేడాతో నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్)ను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ధర్మాసనంలోని సభ్యుల మధ్య చర్చ లేకుండా తీర్పు ఇచ్చారని, 2011 నీట్ నోటిఫికేషన్‌ను పునరుద్ధరిస్తున్నామంటూ జస్టిస్ ఎఆర్ దవే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం సంచలన నిర్ణయం వెలువరించింది. 2011 నోటిఫికేషన్ ప్రకా రం ఎంబీబీఎస్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ), పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్‌బీఈ) పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
తాజా తీర్పులో ఏముంది
ప్రైవేట్ కాలేజీలు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు అవకాశమిస్తూ 2013 తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరముందని న్యాయమూర్తులు ఏఆర్ దవే, ఏకే సిక్రీ, ఆర్‌కె అగ్రవాల్, ఆదర్శ కుమార్ గోయల్, ఆర్.భానుమతిలు అభిప్రాయపడ్డారు. తీర్పు పునఃపరిశీల నకు సంబంధించి పూర్తి కారణాలు ఇవ్వడం లేదని పేర్కొంది. రివ్యూ పిటీషన్లు పరిగణనలోకి తీసుకుని తాజాగా విచారణ జరుపుతామని చెప్పింది. 2013లో తీర్పు సందర్భంగా అప్పటి ధర్మాసనంలో ఉన్న జస్టిస్ ఏఆర్ దవే మిగతా ఇద్దరి సభ్యుల్ని వ్యతిరేకిస్తూ తీర్పునిచ్చారు. మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రంజిత్ సేన్(రిటైర్డ్) అప్పటి ప్రధాన న్యాయమూర్తి కబీర్ అభిప్రాయాల్నే వెల్లడిం చారు.
వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల హక్కుల్ని ఉల్లఘింస్తోందంటూ త్రిసభ్య బెంచ్ తీర్పులో పేర్కొంది. తీర్పును ఒక న్యాయవాది ముందుగానే సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనం సృష్టించింది. తగినంత సమయం లేకపోవడంతో విచారణ అంశంపై బెంచ్‌లోని సభ్యుల మధ్య ఎలాంటి చర్చ జరగలేదని జస్టిస్ దవే తన తీర్పులో తెలిపారు. అక్టోబర్ 23, 2013న తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటీషన్లు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ అయ్యాయి.
ఎంసీఐ ప్రవేశ పరీక్ష నిర్వహించవచ్చు: కేంద్రం
నీట్‌పై సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యం లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిబంధనలు మళ్లీ అమల్లోకి వచ్చినట్లేనని కేంద్రం తెలిపింది. తాజా తీర్పుతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) ప్రవేశ పరీక్ష నిర్వహిం చవచ్చని చెప్పింది. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కూడా సుప్రీం తీర్పును స్వాగతించింది. తీర్పును పరిశీలించాకే ప్రకటన చేస్తామని ఎంసీఐ వెల్లడించింది. దేశంలో వైద్య విద్యను నియంత్రించేం దుకు ఈ తీర్పు ఉపయోగపడుతుందని, సరిగా అమలుచేస్తే విద్యార్థులు లాభపడతారని ఎంసీఐ అధికారులు చెప్పారు.