
న్యూఢిల్లీ: కన్నుగీటి పాపులర్ అయిన మలయాళ నటి ప్రియా వారియర్‌పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలోని పాట కారణంగా మత విశ్వాసాలు దెబ్బతిన్నాయంటూ నటి ప్రియ, దర్శక, నిర్మాతలపై తెలంగాణసహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవడం తెల్సిందే. దీంతో ప్రియ, దర్శక, నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సినిమాలో వివాదానికి కారణమైన ఆ పాట 1978 నుంచి ప్రజలకు, ముఖ్యంగా ముస్లింల ఆదరణ పొందిన ఒక జానపద గీతమని ప్రియా తరఫు న్యాయవాది తెలిపారు. పాటపై తమకెలాంటి అభ్యంతరం లేదనీ, చిత్రీకరణే అభ్యంతరకరంగా ఉందంటూ ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాది చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘ఎవరో పాటలు పాడుకుంటున్నారు. కేసు నమోదు చేయడం మినహా మీకు మరే పనీ లేదు..’ అంటూ తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడింది.