న్యూఢిల్లీ: మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి ప్రియా ప్రకాశ్ వారియర్(18)కు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రియాతో పాటు ఈ చిత్ర దర్శకుడు ఒమర్ లులూపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. అలాగే వీరిద్దరిపై కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయరాదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
ఒరు అదార్ లవ్ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ పాట ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసేలా చిత్రీకరించారంటూ తెలంగాణ, మహారాష్ట్రల్లో వారిపై క్రిమినల్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ ప్రియా వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పాట కేరళలో చాలా ప్రాచుర్యం పొందిందనీ, దీన్ని అపార్థం చేసుకోవడం వల్లే వేర్వేరు రాష్ట్రాల్లో తమపై కేసులు నమోదయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయమై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment